
కోల్‌కతా: బ్యాడ్మింటన్‌లో సాంకేతిక అంశాల్లో సహకారం అందించే విషయంలో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఏ)తో ప్రఖ్యాత సాంకేతిక విద్యా సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ జతకట్టింది. క్రీడాకారులకు ఇచ్చే కోచింగ్‌తో పాటు సాంకేతిక రంగాల్లో సహకారం అందించేందుకు ఈ సంస్థ సిద్ధమైంది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ పీపీ చక్రవర్తి, పీజీబీఏ వ్యవస్థాపకుడు పుల్లెల గోపీచంద్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం క్రీడాకారులకు అందించే కోచింగ్‌లో వినూత్న పద్ధతులు రూపొందించే విషయంలో ఐఐటీ ఖరగ్‌పూర్ సహాయపడుతుంది.
క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరిచేలా శిక్షణలో ఎలాంటి పద్ధతులు ఉపయోగించాలనే అంశాలపై కోచ్‌లకు సహకరిస్తుంది. దీనితో పాటు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రాంగణంలో మరో స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేయనుంది. దీనిపై గోపీచంద్ స్పందిస్తూ ‘ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అకాడమీ అందుబాటులోకి రానుండటం శుభపరిణామం. ఈ అకాడమీ అభివృద్ధికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని’ పేర్కొన్నారు. ఈ ఒప్పందంపై ప్రొఫెసర్ చక్రవర్తి హర్షం వ్యక్తం చేశారు. గోపీచంద్‌తో సమన్వయం చేసుకుంటూ బ్యాడ్మింటన్ క్రీడకు మరింత ప్రాచుర్యం తీసుకువస్తామని ఆయన అన్నారు.