హోమ్ లెస్ వరల్డ్ కప్.. మెరిసిన భారత్
న్యూఢిల్లీ: మనకు క్రికెట్ వరల్డ్ కప్, ఫుట్ బాల్ వరల్డ్ కప్ గురించి పరిచయం ఎక్కువ. అయితే హోమ్ లెస్ వరల్డ్ కప్ మనం చూసింది.. విన్నది కూడా తక్కువే. అయితే మనకు పెద్దగా పరిచయం లేని హోమ్ లెస్ వరల్డ్ కప్ లో భారత్ మెరిసింది. ఇటీవల అమెస్టర్ డామ్, నెదర్లాండ్స్ వేదికగా జరిగిన హోమ్ లెస్ సాకర్ టోర్నమెంట్ లో 555 ఆటగాళ్లతో కూడిన 48 జట్లు పాల్గొన్నాయి. ఇందులో భారత పురుషుల జట్టు విజేతగా నిలవగా.. మహిళల జట్టు మాత్రం ఆరో స్థానంలో నిలిచింది.
ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఫిన్ లాండ్, గ్రెనడా, బెల్జియం, ఇజ్రాయిల్ తదితర దేశాలతో భారత పురుషుల జట్టు మొత్తంగా 12 మ్యాచ్ లు ఆడింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-2 తేడాతో బెల్జియంను ఓడించి సెమీస్ లో ఇజ్రాయిల్ తో తలపడింది. ఈ పోరులో 4-2 తేడాతో ఇజ్రాయిల్ ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. అయితే పటిష్టమైన గ్రెనడా జట్టును 3-4 తేడాతో భారత్ ఓడించి కప్ ను కైవసం చేసుకుంది.
ఈ టోర్నమెంట్ వెనుక ప్రధాన ఉద్దేశం
హోమ్ లెస్ వరల్డ్ కప్ అనేది వార్షిక టోర్నమెంట్. దీన్ని హోమ్ లెస్ వరల్డ్ కప్ సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. కనీసం ఉండటానికి ఇళ్లు లేకుండా వీధులకే పరిమితమైన అనాథల జీవితాల్లో మార్పు తేవడానికే ప్రవేశపెట్టిందే ఈ టోర్నమెంట్. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 దేశాలు హోమ్ లెస్ వరల్డ్ కప్ లో పాల్గొంటాయి.
భారత్ లో ఆటగాళ్ల ఎంపిక ఇలా..
హోమ్ లెస్ వరల్డ్ కప్ కు భారత్ కు చెందిన ఆటగాళ్లను వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందుకు ప్రతీ ఏడాది నేషనల్ స్లమ్ సాకర్ చాంపియన్ షిప్ ను నిర్వహిస్తారు. భారత్ కు చెందిన స్లమ్ సాకర్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి. సామాజిక మార్పులో భాగంగా ఇక్కడ రాణించిన ఆటగాళ్లను హోమ్ లెస్ వరల్డ్ కప్ కు ఎంపిక చేస్తారు. ప్రధానంగా దేశంలోని 15 రాష్ట్రాల నుంచి వచ్చే 32 మంది ఆటగాళ్లను ఎంపిక చేసి హోమ్ లెస్ వరల్డ్ కప్ కు పంపుతారు. ఇప్పటివరకూ భారత్ ఏడు హోమ్ లెస్ వరల్డ్ కప్ ల్లో పాల్గొనడం విశేషం.