homeless worldcup
-
గోల్ కొట్టి అమెరికాకు.. మెరిసిన ప్రొద్దుటూరు బాలిక
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కానపల్లె గ్రామానికి చెందిన వజ్జల శ్రీదేవి త్వరలో కాలిఫోర్నియాలో జరగనున్న అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీల్లో పాల్గొననుంది. కానపల్లె గ్రామానికి చెందిన ఈమె తల్లిదండ్రులు శ్రీనివాసులు, సుబ్బమ్మ వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తమ కుమార్తెకు క్రీడలపై ఉన్న ఆసక్తిని గమనించి నాలుగో తరగతిలోనే కడపలోని వైఎస్సార్ క్రీడా పాఠశాలలో చేర్పించారు. తర్వాత శ్రీదేవి నెల్లూరు శాప్ అకాడమీలో ఉంటూ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ఫుట్‌బాల్‌పై పట్టు ఉన్న శ్రీదేవి ఎన్నో మార్లు పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. గతంలో అరుణాచలంలో జరిగిన సీనియర్ క్యాంప్, కటక్‌లో జరిగిన జూనియర్ క్యాంప్, గుంటూరులో జరిగిన ఎస్జీఎఫ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించింది. ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాగపూర్‌లోని స్లమ్స్ సాకర్ స్టేడియంలో ఇండియా ఫుట్‌బాల్ జట్టుకు సంబంధించి ఎంపికలు జరిగాయి. ఇందులో మొత్తం 28 మందిని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వజ్జల శ్రీదేవి ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యార్థినికి కోచ్‌గా కె.సాయికిరణ్ వ్యవహరిస్తున్నారు. హోమ్‌లెస్ వరల్డ్ కప్ అంటే.. హోమ్‌లెస్ వరల్డ్ కప్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించే వార్షిక అసోసియేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్. ఇది అసోసియేషన్ ఫుట్‌బాల్ క్రీడ ద్వారా నిరాశ్రయులు లేకుండా చేయాలని సూచించే సామాజిక సంస్థ. సంస్థ వార్షిక ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తుంది. ఇక్కడ వివిధ దేశాల నుంచి నిరాశ్రయులైన వ్యక్తుల జట్లు పోటీపడతాయి. నిరాశ్రయులైన ప్రపంచ కప్ సంస్థను 2001లో మెల్ యంగ్, హెరాల్డ్ ష్మీడ్ స్థాపించారు. నిరాశ్రయుల కోసం మొదటి వార్షిక ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2003లో ఆస్ట్రియాలోని గ్రాజ్లో జరిగింది. ఇటీవల 2019 ఎడిషన్‌ను వేల్స్ కార్డిఫ్‌లోని బ్యూట్ పార్క్‌లో నిర్వహించింది. 2020 టోర్నమెంట్ ఫిన్లాండ్లోని టాంపేర్‌లో జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా రద్దు అయింది. 2023 ఏప్రిల్‌లో యూఎస్ఏలోని కాలిఫోర్నియాలో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. హోమ్‌లెస్ వరల్డ్ కప్ యొక్క అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం స్కాట్లాండ్లోని ఎడిన్‌బర్గ్‌లోని ఈస్టర్ రోడ్ స్టేడియంలో ఉంది. జాతీయ జట్టులో.. వజ్జల శ్రీదేవి త్వరలో అమెరికాలోని కాలిఫోర్నియాలో జరగనున్న ఫుట్‌బాల్ హోమ్‌లెస్ వరల్డ్ కప్ పోటీలకు వెళ్లనుంది. ఈ ఏడాది జరగనున్న పోటీలకు సంబంధించి ఇండియా జట్టును ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీదేవి ప్రథమ స్థానంలో ఉంది. – కె.సాయికిరణ్, ఫుట్‌బాల్ కోచ్ వరల్డ్ కప్‌లో విజయమే లక్ష్యం ఇండియా జట్టుకు ఎంపికయ్యాను. వరల్డ్ కప్ పోటీల్లో విజయమే లక్ష్యంగా ప్రతిభ చూపుతా. చిన్ననాటి నుంచి ఫుట్‌బాల్ క్రీడపై ఎంతో మక్కువ. చదువు లేని నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. – వజ్జల శ్రీదేవి, ఫుట్‌బాల్ క్రీడాకారిణి, కానపల్లె, ప్రొద్దుటూరు మండలం, వైఎస్సార్ జిల్లా. -
న్యూస్ మేకర్: జీవితం ఆమెతో ఫుట్‌బాల్ ఆడింది
మొన్న ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మన పురుషుల టీం కనిపించిందా? పురుషుల టీమ్‌ను తయారు చేసుకోలేని మనం స్త్రీల టీమ్‌ను మాత్రం ఏం పట్టించుకుంటాం? అసలు ఫుట్‌బాల్ ఆడే అమ్మాయిలకు మన దేశంలో ఏం మర్యాద, ప్రోత్సాహం ఉన్నాయి? కోల్కటా ఫుట్‌బాల్ క్రీడాకారిణి పౌలమి అధికారి ఒకప్పుడు దేశ జట్టులో ఆడింది. ఇప్పుడు? జరుగుబాటు కోసం జొమాటో డెలివరి గర్ల్‌గా పని చేస్తోంది. గత రెండు మూడు రోజులుగా ఈమె జీవిత అవస్థ గురించి సోషల్ మీడియాలో, మీడియాలో ఆవేదన వ్యక్తం అవుతోంది. జొమాటో అని రాసి ఉన్న ఎర్రటి టీ షర్ట్ తొడుక్కుని కోల్కటాలో సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేస్తున్న 24 ఏళ్ల పౌలమి అధికారి ఒక ఫుట్‌బాల్ క్రీడాకారిణి అని ఎవరూ ఊహించరు. గత కొంతకాలంగా ఇల్లు గడవడానికి పౌలమి ఫుడ్ డెలివరీ చేస్తోంది. కోల్కటాకే చెందిన సంజుక్త చౌధురి అని ట్విటర్ యూజర్ పౌలమి గురించి చిన్న వీడియో తీసి ట్విటర్లో ఉంచడంతో గత రెండు మూడు రోజుల్లోనే చాలా రెస్పాన్స్‌లు వచ్చాయి. విస్తృతంగా కామెంట్స్ కూడా వచ్చాయి. ఒక ఫుట్‌బాల్ క్రీడాకారిణి నిస్సహాయ స్థితిలో ఉండటం ఏ మాత్రం సరికాదనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. అబ్బాయి అనుకునేవారు కోల్‌కటాలోని బెహలా ప్రాంతంలో నివసించే పౌలమి బాల్యంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తుంటే మేనత్త పెంచి పెద్ద చేసింది. చిన్నప్పటి నుంచే పౌలమి ఫుట్‌బాల్ ఆడేది. అయితే అబ్బాయిలాగా కనిపించే పౌలమిని చూసి అందరూ అబ్బాయి అనుకుని ఆడించేవారు. ‘ఆ తర్వాత నేను అమ్మాయి అని తెలిశాక ఆటలో రానివ్వలేదు. అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడితే వారికి ఏ మర్యాద లేదు. నేను ఫుట్‌బాల్ మానేసి కొన్నాళ్లు హాకీ ఆడాను. అయితే మా ప్రాంతంలోని అనిత సర్కార్ అనే ఫుట్‌బాల్ కోచ్ నన్ను చూసి ఫుట్‌బాల్‌లో ట్రయినింగ్ ఇచ్చింది. నేను మంచి ప్లేయర్‌ని అయ్యాను’ అంటుంది పౌలమి. పదిహేను ఏళ్లు వచ్చేసరికే పౌలమి మంచి ఫుట్‌బాల్ క్రీడాకారిణి అయ్యింది. దేశం తరఫున అండర్ 16 జట్టుకు ఎంపికయ్యి 2013లో జరిగిన అండర్ 16 ఛాంపియన్షిప్ కోసం శ్రీలంక వెళ్లి ఆడింది. అయితే ఆ సమయంలో తగిలిన గాయాల నుంచి కోలుకోవడం కష్టమైంది. ఇంటివాళ్లుగాని, క్రీడా సంస్థలుగాని సరైన వైద్యం, ఫిట్నెస్ ట్రయినింగ్ ఇప్పించకపోవడంతో వెనుకబడింది. మళ్లీ కోలుకుని 2016లో జరిగిన స్ట్రీట్ ‘హోమ్‌లెస్ ఫుట్‌బాల్ వరల్డ్‌కప్’ కోసం దేశం తరఫున గ్లాస్గో వెళ్లి ఆడింది. ఆ తర్వాత కూడా ఆమెకు ఫుట్‌బాల్ అసోసియేషన్ నుంచి ఎటువంటి మద్దతు, ప్రోత్సాహం లభించలేదు. వెంటాడిన పేదరికం 2017లో తండ్రి చేస్తున్న డ్రైవర్ ఉద్యోగం పోయింది. ఇంకో చెల్లెలు, తను తప్ప సంపాదనకు ఎవరూ లేరు. 2019 నాటికి బతకడం దుర్భరమైంది. ‘అప్పుడే నేను జొమాటోలో చేరారు. ఆ రోజుల్లో రోజుకు 500 సంపాదించేదాన్ని. లాక్డౌన్ ఎత్తేశాక చాలామంది ఈ ఉద్యోగంలోకి వచ్చారు. ఆర్డర్లు తక్కువ. పైగా నాకు సైకిల్ తప్ప బండి లేదు. దాంతో దగ్గరి ఆర్డర్లే తీసుకుంటాను. అందువల్ల రోజుకు 400 వస్తాయి. ఒక్కో ఆర్డర్ మీద 20 లేదా 30 రూపాయలు వస్తాయి. ఒక్కోసారి రోజుకు 300 రూపాయలకు మించి రావు. నాకు వేరే దారి లేదు... ఈ పని తప్ప’ అంది పౌలమి. రోజుకు 12 గంటలు పని చేస్తూ కూడా ఒక్కోసారి ఫుట్‌బాల్‌ను సాధన చేస్తుంటుంది పౌలమి. బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నదిగాని అది కూడా నత్తనడకన సాగుతున్నది. వెల్లువెత్తిన స్పందన పౌలమి కథనానికి స్పందన వెల్లువెత్తింది. దేశంలో ఫుట్‌బాల్ క్రీడాకారుల స్థితి ఆ మాటకొస్తే ఏ కొద్ది మందో తప్ప అందరు క్రీడాకారుల స్థితి ఇలాగే ఉందనే స్పందన వచ్చింది. ఫుట్‌బాల్ ఆటను ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇన్ని కోట్ల మంది భారతీయులు ఉన్నా పురుషులలోగాని, స్త్రీలలోగాని ప్రపంచ దేశాలతో తలపడే మెరుగైన టీమ్‌లు తయారు కావడం లేదనే విమర్శలు వచ్చాయి. ‘నాకు ఇప్పుడు కుదురైన ఉద్యోగం, ప్రాక్టీసు చేయడానికి మంచి స్పైక్స్ కావాలి’ అంటున్న పౌలమిలాంటి వారిని ఆ స్థితిలో ఉంచడం విషాదం. ఇప్పుడు వచ్చిన స్పందనతో ఆమెకు ఎలాంటి సహాయం అందుతుందో చూడాలి. -
హోమ్ లెస్ వరల్డ్ కప్.. మెరిసిన భారత్
న్యూఢిల్లీ: మనకు క్రికెట్ వరల్డ్ కప్, ఫుట్ బాల్ వరల్డ్ కప్ గురించి పరిచయం ఎక్కువ. అయితే హోమ్ లెస్ వరల్డ్ కప్ మనం చూసింది.. విన్నది కూడా తక్కువే. అయితే మనకు పెద్దగా పరిచయం లేని హోమ్ లెస్ వరల్డ్ కప్ లో భారత్ మెరిసింది. ఇటీవల అమెస్టర్ డామ్, నెదర్లాండ్స్ వేదికగా జరిగిన హోమ్ లెస్ సాకర్ టోర్నమెంట్ లో 555 ఆటగాళ్లతో కూడిన 48 జట్లు పాల్గొన్నాయి. ఇందులో భారత పురుషుల జట్టు విజేతగా నిలవగా.. మహిళల జట్టు మాత్రం ఆరో స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఫిన్ లాండ్, గ్రెనడా, బెల్జియం, ఇజ్రాయిల్ తదితర దేశాలతో భారత పురుషుల జట్టు మొత్తంగా 12 మ్యాచ్ లు ఆడింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-2 తేడాతో బెల్జియంను ఓడించి సెమీస్ లో ఇజ్రాయిల్ తో తలపడింది. ఈ పోరులో 4-2 తేడాతో ఇజ్రాయిల్ ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. అయితే పటిష్టమైన గ్రెనడా జట్టును 3-4 తేడాతో భారత్ ఓడించి కప్ ను కైవసం చేసుకుంది. ఈ టోర్నమెంట్ వెనుక ప్రధాన ఉద్దేశం హోమ్ లెస్ వరల్డ్ కప్ అనేది వార్షిక టోర్నమెంట్. దీన్ని హోమ్ లెస్ వరల్డ్ కప్ సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. కనీసం ఉండటానికి ఇళ్లు లేకుండా వీధులకే పరిమితమైన అనాథల జీవితాల్లో మార్పు తేవడానికే ప్రవేశపెట్టిందే ఈ టోర్నమెంట్. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 దేశాలు హోమ్ లెస్ వరల్డ్ కప్ లో పాల్గొంటాయి. భారత్ లో ఆటగాళ్ల ఎంపిక ఇలా.. హోమ్ లెస్ వరల్డ్ కప్ కు భారత్ కు చెందిన ఆటగాళ్లను వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందుకు ప్రతీ ఏడాది నేషనల్ స్లమ్ సాకర్ చాంపియన్ షిప్ ను నిర్వహిస్తారు. భారత్ కు చెందిన స్లమ్ సాకర్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి. సామాజిక మార్పులో భాగంగా ఇక్కడ రాణించిన ఆటగాళ్లను హోమ్ లెస్ వరల్డ్ కప్ కు ఎంపిక చేస్తారు. ప్రధానంగా దేశంలోని 15 రాష్ట్రాల నుంచి వచ్చే 32 మంది ఆటగాళ్లను ఎంపిక చేసి హోమ్ లెస్ వరల్డ్ కప్ కు పంపుతారు. ఇప్పటివరకూ భారత్ ఏడు హోమ్ లెస్ వరల్డ్ కప్ ల్లో పాల్గొనడం విశేషం.