ఈ సారైనా అందుకుంటారా! | Third Test from today | Sakshi
Sakshi News home page

ఈ సారైనా అందుకుంటారా!

Published Thu, Aug 27 2015 11:38 PM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

ఈ సారైనా అందుకుంటారా!

ఈ సారైనా అందుకుంటారా!

సిరీస్ విజయంపై భారత్ గురి
♦ ఆత్మవిశ్వాసంతో కోహ్లి సేన
♦ అనిశ్చితిలో శ్రీలంక
♦ నేటినుంచి మూడో టెస్టు
 
 తొలి టెస్టు చేతుల్లోకి వచ్చి పోయింది... తప్పును దిద్దుకున్న కోహ్లి సేన రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థిని కుప్పకూల్చింది... ఇప్పుడు మిగిలింది మరో టెస్టు విజయం. మన ఆటగాళ్ల ప్రదర్శన, ప్రత్యర్థి ‘ఫామ్’ చూస్తే 22 ఏళ్ల తర్వాత లంక గడ్డపై సిరీస్ గెలిచేందుకు మన జట్టుకు ఇది సువర్ణావకాశం. మరో వైపు నాలుగున్నరేళ్ల క్రితం విదేశీ గడ్డపై సిరీస్ నెగ్గిన టీమిండియా ఆ తర్వాతి ఏడు సిరీస్‌లలో రిక్తహస్తాలతోనే వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారైనా అవకాశాన్ని అందుకుంటారా అనేది ఆసక్తికరం.
 
 కొలంబో : కెప్టెన్‌గా తొలి టెస్టు విజయాన్ని రుచి చూసిన విరాట్ కోహ్లి ఇప్పుడు తొలి సిరీస్ గెలుపుపై కన్నేశాడు. రెండో టెస్టులో అద్భుత విజయం తర్వాత రెట్టింపు ఉత్సాహంతో కనిపిస్తున్న టీమిండియా చివరి టెస్టుపై కూడా ఆత్మవిశ్వాసంతో ఉంది. నేటినుంచి (శుక్రవారం) ఇక్కడి సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగే సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టులో భారత్, శ్రీలంకతో తలపడుతుంది. మరో వైపు సంగక్కర రిటైర్మెంట్‌తో కొత్తగా కనిపిస్తున్న లంక, తుది జట్టు విషయంలో గందరగోళంలో ఉంది. సొంతగడ్డపై వరుసగా రెండో సిరీస్ ఓడిపోకూడదని భావిస్తున్న ఆ జట్టు ఏ మాత్రం పోటీ ఇస్తుందో చూడాలి.

 పుజారా, ఓజాలకు చోటు
 గాలే టెస్టులో రెండో ఇన్నింగ్స్ మినహా సిరీస్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లో ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించింది. రోహిత్ శర్మ మినహా బ్యాటింగ్‌లో అంతా కీలక సమయాల్లో పరుగులు సాధించారు. లోకేశ్ రాహుల్, కోహ్లి, రహానే సెంచరీలు సాధించగా, సిరీస్‌నుంచి తప్పుకున్న ధావన్, విజయ్, సాహా కూడా ఆకట్టుకున్నారు. కాబట్టి జట్టు బ్యాటింగ్‌కు సంబంధించి భారత శిబిరంలో ఎలాంటి ఆందోళన లేదు. భారత్ ఆడిన గత నాలుగు టెస్టుల్లో స్థానం లభించని పుజారా మళ్లీ టీమ్‌లోకి రానున్నాడు. ఆర్డర్ విషయంలో కోహ్లి మరీ కొత్తగా ఆలోచించకపోతే పుజారా, రాహుల్ ఓపెనింగ్ చేస్తారు.

తన సత్తాను నిరూపించుకునేందుకు పుజారాకు ఇది మంచి అవకాశం. వికెట్ కీపర్‌గా నమన్ ఓజాకు 32 ఏళ్ల వయసులో తొలి టెస్టు ఆడనున్నాడు. తుది జట్టులో ఈ రెండు మార్పులు ఖాయం. బిన్నీ బ్యాట్స్‌మన్‌గా పెద్దగా ప్రభావం చూపకపోయినా బౌలింగ్‌లో రాణించాడు కాబట్టి కోహ్లికి సమస్య లేదు. అందువల్ల కొత్తగా వచ్చిన కరుణ్ నాయర్ బెంచీకే పరిమితం కానున్నాడు. బౌలింగ్‌లో భారత్ మరోసారి తమ ప్రధానాస్త్రం అశ్విన్‌నే నమ్ముకుంది. 2 టెస్టుల్లో అతను ఇప్పటికే 17 వికెట్లు పడగొట్టి లంక బ్యాట్స్‌మెన్ పాలిట సింహస్వప్నంగా తయారయ్యాడు. అతనికి మిశ్రా (12 వికెట్లు) అండగా నిలుస్తుండగా... పేస్‌లో ఇషాంత్, ఉమేశ్ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

 తరంగకు అవకాశం
 మరో వైపు కెప్టెన్ మ్యాథ్యూస్ చక్కటి ఫామ్‌లో ఉండటం మినహా... లంక పరిస్థితి ఆశాజనకంగా లేదు. మరో సీనియర్ హెరాత్ తొలి టెస్టులో చెలరేగినా, సారా ఓవల్‌లో తేలిపోయాడు. సంగక్కర స్థానంలో ఉపుల్ తరంగకు అవకాశం దక్కనుంది. అతడిని ఏ స్థానంలో ఆడించాలి, ప్రధాన బ్యాట్స్‌మన్ తిరిమన్నెను ముందుగా పంపించాలా వద్దా, వికెట్ కీపింగ్ ఎవరితో చేయించాలి... ఇలా ప్రతీది ఆ జట్టుకు సమస్యగా కనిపిస్తోంది. ఘోరంగా విఫలమవుతున్న ముబారక్ స్థానంలో వన్డే స్పెషలిస్ట్ కుషాల్ పెరీరా తొలి టెస్టు ఆడే అవకాశం ఉంది. అయితే అతడు కీపింగ్ చేస్తే చండీమల్ పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గా ఆర్డర్ మారవచ్చు.

అశ్విన్ తీసిన 17 వికెట్లలో 12 లెఫ్ట్ హ్యండర్లవే ఉన్నాయి. అలాంటప్పుడు ఇద్దరు ఎడం చేతివాటం ఆటగాళ్లను బరిలోకి దించడం ఎంతవరకు ప్రయోజనమో ఆ జట్టు ఆలోచిస్తోంది. మ్యాథ్యూస్‌కు కూడా తాను ఆడే స్థానంపై స్పష్టత లేదు. బౌలింగ్‌లో గాయంనుంచి కోలుకున్న పేసర్ ప్రదీప్ తిరిగి జట్టులోకి రానుండటం ఊరట. అయితే రెండో టెస్టులో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన ప్రధాన స్పిన్నర్ కౌశల్ దూరమైతే, దిల్‌రువాన్ పెరీరాను ఆడించాల్సి ఉంటుంది. మొత్తానికి తమ దిగ్గజాలు జయవర్ధనే, సంగక్కర రిటైర్ అయ్యాక తొలి టెస్టు ఆడుతున్న లంక మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.

 జట్లు(అంచనా) : భారత్: కోహ్లి (కెప్టెన్), పుజారా, రాహుల్, రహానే, రోహిత్, బిన్నీ, నమన్, అశ్విన్, ఉమేశ్, మిశ్రా, ఇషాంత్.
 శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టెన్), కరుణరత్నే, సిల్వ, తరంగ, తిరిమన్నె, చండీమల్, కుషాల్ పెరీరా, ప్రసాద్, ప్రదీప్, హెరాత్, కౌశల్/దిల్‌రువాన్
 
 పిచ్, వాతావరణం
 ఇక్కడ జరిగిన గత ఐదు టెస్టుల్లో నాలుగు డ్రాగా ముగిశాయి. గత ఏడాది కాలంలో ప్రపంచంలోని అతి ‘ఫ్లాట్’ వికెట్‌లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్‌ఎస్‌సీ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. ఆరంభంలో కొంత పేస్ ప్రభావం చూపినా భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వర్షం అంతరాయం కలిగించవచ్చు. గత కొన్ని రోజులుగా నగరంలో తరచూ వర్షం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement