భారత క్రికెట్‌లో ఓ చీకటి రోజు! | On ThisDay World Cup Semi Final At Eden Gardens That Ended In Shame And tears For India | Sakshi
Sakshi News home page

భారత క్రికెట్‌లో ఓ చీకటి రోజు!

Published Tue, Mar 13 2018 2:29 PM | Last Updated on Tue, Mar 13 2018 2:31 PM

On ThisDay World Cup Semi Final At Eden Gardens That Ended In Shame And tears For India - Sakshi

1996 ప్రపంచకప్‌లో సచిన్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, స్పోర్ట్స్‌ : సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున భారత క్రికెట్‌ చరిత్రలో ఓ చీకటి రోజుగా నిలిచిపోయింది. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో భాగంగా 1996 మార్చి 13న కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అవమానకర రీతిలో ఓటమి పాలైంది. అభిమానుల ఆగ్రహావేశాల మధ్య ప్రపంచకప్‌ పోటీ నుంచి నిష్ర్కమించింది. ప్రపంచకప్‌ సొంతమవుతోందని కలలు కన్న భారత అభిమానులకు కన్నీళ్లే మిగిలాయి. దీంతో అభిమానుల ఆగ్రహావేశాలు ప్రపంచ క్రికెట్‌ ముందు బీసీసీఐని దోషిగా నిలబెట్టాయి. ఒక బ్లాక్‌ డేగా మిగిలి పోయిన ఆనాటి మ్యాచ్‌ను ఒకసారి నెమరువేసుకుందాం.

సచిన్‌ ఒక్కడే..
మహ్మద్ అజహరుద్దీన్ నాయకత్వంలోని టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన లంక తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. అరవింద్ డిసిల్వా, రోహన్ మహనామ అర్థసెంచరీలతో జట్టును నిలబెట్టారు. ముఖ్యంగా డిసిల్వా దుమ్మురేపే బ్యాటింగ్ తో భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 47 బంతుల్లో 14 ఫోర్లతో 66 పరుగులు బాదాడు. మహనామ జాగ్రత్తగా ఆడి 101 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేశాడు.

252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే సచిన్ టెండూల్కర్, మంజ్రేకర్ ఆచితూచి ఆడి 98 పరుగుల వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 98 పరుగుల వద్ద సచిన్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ అజహరుద్దీన్ డకౌట్ కావడంతో 99 పరుగుల వద్ద మూడో వికెట్ చేజార్చుకుంది. అక్కడి నుంచి టీమిండియా బ్యాటింగ్ పేకమేడల్లా కుప్పకూలింది.  వచ్చిన బ్యాట్స్ మన్ వచ్చినట్టే పెవిలియన్‌కు క్యూ కట్టారు. 34.1 ఓవరల్లో 120 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ముగ్గురు ఆటగాళ్లు డకౌట్‌ కావడం విశేషం.

అభిమానుల ఆగ్రహం..
భారత ఆటగాళ్ల నిర్లక్ష్యపు ఆటతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కనీస పోరాటపటిమ కనబరచకుండా టీమిండియా బ్యాట్స్‌మెన్‌ నిష్క్రమించడంతో మైదానంలోని ప్రేక్షకులు విరుచుకుపడ్డారు. స్టేడియంలోని కొన్ని స్టాండ్లకు నిప్పుపెట్టారు. వాటర్ బాటిళ్లు మైదానంలోకి విసిరేశారు. దీంతో కొద్దిసేపు మ్యాచ్ నిలిచిపోయింది. ఆట మళ్లీ మొదలైన తర్వాత కూడా రగడ ఆగలేదు. ప్రేక్షకులు మరోసారి బాటిళ్లు విసిరారు. దీంతో మ్యాచ్ రిఫరీ ఆటను నిలిపివేశారు. అప్పటివరకు నమోదైన స్కోర్ల ప్రకారం శ్రీలంక గెలిచినట్టు ప్రకటించారు. ఫలితంగా తొలిసారిగా శ్రీలంక వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇలా అభిమానుల కారణంగా మ్యాచ్‌ నిలిపోవడం అప్పటి వరకు అదే తొలిసారి. ఇక ఫైనల్లో ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో ఓడించి లంకేయులు తొలిసారిగా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement