న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చే పరిణామం...వన్డే ప్రపంచకప్ వేదికల్లో ఒకటిగా ఖాయమై రూ. 117 కోట్లతో ఆధునీకరణకు ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోందని, మెగా ఈవెంట్‌లో టీమిండియా మ్యాచ్‌ను వీక్షించవచ్చని భావించిన ఫ్యాన్స్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు ఆడే అవకాశం లేదని తేలింది. మ్యాచ్ వేదికలు, తేదీలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి బీసీసీఐ షెడ్యూల్ డ్రాఫ్ట్ సమర్పించింది. ఇందులో టీమిండియా లీగ్ దశలో ఆడే 9 మ్యాచ్‌ల వేదికల్లో హైదరాబాద్ పేరు లేదు.
ఉప్పల్ స్టేడియాన్ని భారత మ్యాచ్ కోసం పరిగణలోకి తీసుకోలేదు. బోర్డు పంపిన జాబితాను వరల్డ్ కప్ ఆడే అన్ని జట్లకూ పంపించి వారి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఐసీసీ అధికారిక ప్రకటన చేస్తుంది. అయితే... సాధారణంగా ఆతిథ్య దేశం ఇచ్చిన డ్రాఫ్ట్‌లో మార్పులు లేకుండానే ఐసీసీ ఆమోదిస్తుంది కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకటన లాంఛనమే. భారత జట్టు ఆడకపోయినా... 2011 వరల్డ్ కప్‌తో పోలిస్తే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగడమే అభిమానులకు కాస్త ఊరట. డ్రాఫ్ట్ ప్రకారం పాకిస్తాన్ జట్టు ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.
తొలి మ్యాచ్, ఫైనల్ అహ్మదాబాద్‌లోనే...
లక్షకు పైగా సామర్థ్యం ఉన్న అహ్మదాబాద్ స్టేడియం సహజంగానే వరల్డ్‌కప్‌కు ప్రధాన వేదిక కానుంది. 2019 వరల్డ్ కప్ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న జరిగే మ్యాచ్‌లో ఈ విశ్వ సమరం మొదలవుతుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ షెడ్యూల్‌లో లీగ్ దశకే పరిమితం కాగా... నవంబర్ 15, 16న జరిగే సెమీ ఫైనల్ వేదికల గురించి ఇంకా పేర్కొనలేదు. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే తొలి పోరుతో భారత్ వరల్డ్ కప్ వేట మొదలవుతుంది. నిజానికి పూర్తి స్థాయి షెడ్యూల్‌ను బీసీసీఐ ఎప్పుడో ప్రకటించాల్సింది.
అయితే భారత గడ్డపై తమ మ్యాచ్‌ల వేదికల విషయంలో పాకిస్తాన్ లేవనెత్తిన అభ్యంతరాలు, ఆసియా కప్‌లో తాము పాల్గొనే అంశంతో ముడిపెట్టడంతో ఇంత ఆలస్యమైంది. పాక్ విజ్ఞప్తిని బట్టి ఆ జట్టు ఆడే మ్యాచ్‌ల విషయంలో బోర్డు కాస్త సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నాకౌట్ దశకు వెళ్లి తప్పనిసరైతే తప్ప అహ్మదాబాద్‌లో ఆడమని చెబుతూ వచ్చిన పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న భారత్, పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్‌లోనే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మినహా తమ 8 మ్యాచ్‌లలో పాకిస్తాన్ తాము సూచించిన నాలుగు వేదికలు కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోనే ఆడనుంది.
భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2011 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను దాదాపు ఏడాది క్రితమే ఐసీసీ ప్రకటించింది. దీని ప్రకారం శ్రీలంక, బంగ్లాదేశ్ కాకుండా భారత్‌లో 8 వేదికల్లో 29 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ఖరారు చేసింది. అప్పట్లోనే అన్ని రకాలుగా సిద్ధమైన హైదరాబాద్ స్టేడియం 3 వన్డేలకు ఆతిథ్యమిచ్చింది కూడా. అయితే వరల్డ్ కప్ మైదానాల్లో మాత్రం ఉప్పల్‌కు చోటు దక్కలేదు. ‘టెస్టు హోదా ఉన్న స్టేడియాలను మాత్రం బోర్డు పరిశీలించింది’ అంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధికారి ఒకరు దానికి వివరణ ఇచ్చారు. ఇప్పుడు పుష్కర కాలం తర్వాత భారత్ మరోసారి వన్డే ప్రపంచ కప్‌ను నిర్వహిస్తోంది.
హైదరాబాద్‌కు మ్యాచ్‌లు దక్కాయన్న ఆనందంలో అభిమానులు ఉండగా, ఇప్పుడు భారత్ మ్యాచ్ లేకపోవడం సహజంగానే నిరాశపర్చే అంశం. క్రికెట్ పట్ల చూపించిన ఆదరణను బట్టి చూస్తే ఉప్పల్ స్టేడియం ఎప్పుడూ నిరాశపర్చలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే కాదు...ఐపీఎల్ హోం టీమ్ సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శన ఇచ్చినా సరే, స్టేడియంలో వారి ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. దేశవ్యాప్తంగా చూస్తే చక్కటి అవుట్‌ఫీల్డ్, ఫిర్యాదులు లేని పిచ్‌తో సహా సౌకర్యాలపరంగా చూస్తే ఇతర అన్ని స్టేడియాలతో పోలిస్తే మేలైన వసతులు ఉన్నాయి. అయితే ఇదంతా బోర్డు పట్టించుకున్నట్లుగా లేదు. వరల్డ్ కప్‌లో వేదికల ఖరారు గురించి గత నెలలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది.
కార్యదర్శి జై షా నేతృత్వంలో ఇది పని చేసింది. భారత మ్యాచ్‌లకు కేటాయించిన 9 వేదికలను చూస్తే వేర్వేరు కారణాలతో వీటిని ఖాయం చేసినట్లుగా అర్థమవుతుంది. భారత క్రికెట్‌లో మొదటినుంచి ‘ప్రధాన’ కేంద్రాలుగా గుర్తింపు పొందిన ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వేదికల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. సహజంగానే పెద్ద స్టేడియమైన అహ్మదాబాద్‌లో అన్నింటికంటే పెద్ద మ్యాచ్ (పాక్‌తో) నిర్వహించాలని బోర్డు భావించింది. మిగతా మూడు వేదికల విషయంలో బోర్డు అంతర్గత రాజకీయాలు పని చేశాయి.
బోర్డు ఉపాధ్యక్షుడైన రాజీవ్ శుక్లా తన సొంత మైదానమైన లక్నోలో, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తమ అసోసియేషన్‌కు చెందిన ధర్మశాలలో మ్యాచ్‌లను తీసుకున్నారు. పుణేకు కూడా మ్యాచ్ కేటాయించుకోవడంలో మహారాష్ట్ర క్రికెట్ సంఘం గట్టిగా ప్రయత్నం చేసి సఫలమైంది. నిజానికి ముందుగా షార్ట్ లిస్ట్ చేసిన 12 వేదికల్లో పుణే పేరు లేదు. ఆ తర్వాత దానిని అదనంగా చేర్చడంలోనే పరిస్థితి అర్థమైంది. బహుశా ఈ మ్యాచ్ ఉప్పల్‌కు దక్కేదేమో. కానీ బోర్డులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఎలాంటి ప్రాతినిధ్యమే లేదు. నిత్య కలహాలతోనే అసోసియేషనే లేకుండా మాజీ న్యాయమూర్తి చేతుల్లో ఉన్న వ్యవస్థ మ్యాచ్‌పై పట్టుబట్టే పరిస్థితిలో అసలే లేదు!
Comments
Please login to add a commentAdd a comment