గ్రాండ్ మాస్టర్ లలిత్‌తో చెస్ ఆడుతున్న వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్.వి సుబ్రహ్మణ్యం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: చిన్నారుల్లో మేధాశక్తిని పెంపొందించేందుకు చెస్ క్రీడ ఎంతగానో దోహద పడుతుందని రాష్ట్ర ప్రభుత్వ వైద్య, ఆర్యోగ శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం చెప్పారు. సైబర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో సోమవారం ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇందులో 15 దేశాల నుంచి వందకు పైగా అంతర్జాతీయ చెస్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా చెస్‌ను తీసుకెళ్లే విధంగా తోడ్పడాలని ఏపీసీఏ అధ్యక్షుడు నర్సింహా రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.కన్నారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. విదేశీ గ్రాండ్ మాస్టర్స్‌తో రాష్ట్ర క్రీడాకారులకు శిక్షణ ఇప్పించే చెస్ అకాడమీ కోసం క్రీడల శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ చేస్తున్న ప్రయత్నాలను ఇంటర్నేషనల్ మాస్టర్ లంక రవి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్‌ఎన్ అధికారి అశోక్ కుమార్, టెక్ మహీంద్ర సీనియర్ ఉపాధ్యక్షుడు బసంత్ కె.మిశ్రా, ఆంధ్రాబ్యాంక్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, పెట్రోలియం మంత్రిత్వ శాఖ మెంబర్ సెక్రటరీ వీరేంద్ర కుమార్ మహేంద్ర, ఏపీసీఏ ఉపాధ్యక్షుడు మేజర్ శివ ప్రసాద్‌లు పాల్గొన్నారు.