
ప్రీతి కళ్లలో ఆనందం కోసం..!
పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు దాదాపు ప్రతి సీజన్‌లోనూ మంచి జట్టే ఉంది. కానీ ఏనాడూ టైటిల్ గెలవలేదు. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు...
బ్యాట్స్‌మెన్ బౌండరీ కొడితే చప్పట్లతో హోరెత్తిస్తుంది.... ఇక సిక్సర్ బాదితే అమాంతం గాల్లోకి ఎగిరి గంతులు వేస్తుంది... మ్యాచ్ గెలిపిస్తే పరిగెడుతూ వెళ్లి అభినందిస్తుంది... ఐపీఎల్‌లో ఏ జట్టుకూ లేని ప్రత్యేక ఆకర్షణ ప్రీతి జింతా రూపంలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు ఉంది. తొలి సీజన్ నుంచీ తన గ్లామర్‌తో ఐపీఎల్‌కు మరింత రంగులద్దిన ప్రీతి జింతాకు... పాపం టైటిల్ మాత్రం ఇప్పటికీ ఊరిస్తూనే ఉంది. ఏడేళ్లలో ఒక్కసారి కూడా ఆ జట్టు ట్రోఫీ గెలవలేదు. గత ఏడాది ఆ జట్టు సంచలనాత్మకంగా ఆడినా... నాకౌట్ ఒత్తిడిలో చిత్తయింది. మరి ఈసారైనా ప్రీతి కళ్లలో ఆనందం చూస్తామా..!
సాక్షి క్రీడావిభాగం
పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు దాదాపు ప్రతి సీజన్‌లోనూ మంచి జట్టే ఉంది. కానీ ఏనాడూ టైటిల్ గెలవలేదు. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు... ఓనర్ల మధ్య గొడవలు కూడా ఈ జట్టును వార్తల్లో నిలబెట్టాయి. జట్టు సహ యజమానులు ప్రీతి జింతా, నెస్‌వాడియాల ప్రేమాయణం, ఆ తర్వాత విడిపోవడం... నెస్ తనను వేధిస్తున్నాడంటూ గత ఏడాది ప్రీతి జింతా ఏకంగా పోలీస్‌కేసు దాకా వెళ్లడం... ఇందులో బీసీసీఐ పెద్దలు సాక్షులుగా ఉండటంతో ఆ జట్టుకు కావలసినంత ప్రచారం వచ్చింది.
2008లో తొలి సీజన్‌ను పంజాబ్ వరుస ఓటములతో మొదలుపెట్టింది. కానీ సంగక్కర, షాన్‌మార్ష్‌ల అనూహ్య ఆటతీరుతో సెమీస్ బెర్త్‌ను దక్కించుకంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ దెబ్బకు సెమీస్‌లో కింగ్ కుదేలైంది. 2009లో జెరోమ్ టేలర్, యూసుఫ్ అబ్దుల్లాను తీసుకుని బౌలింగ్‌ను మరింత బలోపేతం చేసుకున్నా.. ఆసీస్ క్రికెటర్లు అందుబాటులో లేకపోవడం జట్టు ప్రదర్శనను దెబ్బతీసింది. తర్వాతి సీజన్‌లో బ్రెట్ లీ, మార్ష్‌లు విఫలం కావడంతో ఈ రెండుసార్లు గ్రూప్ దశకే పరిమితమైంది.
2011లో ఊహించని విధంగా లీగ్ మాజీ కమిషనర్ లలిత్ మోడి, బీసీసీఐల మధ్య గొడవలు పెరగడంతో పంజాబ్‌తో పాటు రాజస్తాన్ జట్లను ఐపీఎల్ నుంచి తొలగించాలని ప్రయత్నించారు. కానీ హైకోర్టు జోక్యంతో సమస్యను సావధానంగా పరిష్కరించుకున్న పంజాబ్ మైకేల్ బెవాన్‌ను కోచ్‌గా, గిల్‌క్రిస్ట్‌ను కెప్టెన్‌గా నియమించుకుని బరిలోకి దిగినా గ్రూప్ దశను దాటలేకపోయింది. 2012లో కేవలం 8 విజయాలే సాధించడం, 2013లో మిల్లర్ వీరోచిత ప్రదర్శన చేసినా కీలక మ్యాచ్‌ల్లో మిగతా ఆటగాళ్లు తడబడటంతో ఈ రెండు సీజన్లలో కూడా ప్లే ఆఫ్‌కు అర్హత సాధించలేకపోయింది.
మ్యాక్స్‌వెల్ ఓ సంచలనం
గతేడాది (2014) పంజాబ్ జట్టు ఊహించని విధంగా మార్పులు చేసింది. ఢిల్లీ జట్టు నుంచి డాషింగ్ బ్యాట్స్‌మన్ సెహ్వాగ్‌ను తీసుకుని బెయిలీని కెప్టెన్‌గా నియమించుకుంది. మ్యాక్స్‌వెల్, జాన్సన్‌లు చెలరేగడంతో తొలి ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా నెగ్గి జోరు పెంచింది. మ్యాక్స్‌వెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో లీగ్ దశలో ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టించాడు. పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో మూడు మ్యాచ్‌ల్లో 95, 89, 95 స్కోర్లు చేయడంతో లీగ్ మొత్తం మ్యాక్స్‌వెల్ మానియాతో ఊగిపోయింది. 14 మ్యాచ్‌ల్లో 11 విజయాలు సాధించి నాకౌట్‌కు చేరింది. కోల్‌కతా చేతిలో అనూహ్యంగా ఓడినా... చెన్నైని చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. కానీ ఫైనల్లోనూ కోల్‌కతా గండాన్ని దాటలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కచ్చితంగా ైటె టిల్ గెలుస్తామని ధీమాగా ఉన్న ప్రీతి అండ్ కో నిరాశలో మునిగిపోయారు.
స్వల్ప మార్పులు
ఇప్పటికే జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉండటంతో ఫిబ్రవరిలో జరిగిన వేలంపై పంజాబ్ పెద్దగా దృష్టిసారించలేదు. విదేశీ ఆటగాళ్లను ఎవర్ని తీసుకోలేదు. కేవలం స్థానిక ఆటగాళ్లలో మాత్రం స్వల్ప మార్పులు చేసింది. గతేడాది ఆడిన జట్టు నుంచి లక్ష్మీపతి బాలాజీ, మురళీ కార్తీక్, మన్‌దీప్ సింగ్, చతేశ్వర్ పుజారాను తప్పించింది. వీరి స్థానాల్లో యోగేశ్ గోవాల్కర్, నికిల్ నాయక్, మురళీ విజయ్‌లను జట్టులోకి తీసుకొచ్చింది.
కీలక ఆటగాళ్లు
ఆసీస్ వన్డే ప్రపంచకప్ విజేత జట్టులో ఉన్న మ్యాక్స్‌వెల్, జాన్సన్‌లతో పాటు మిల్లర్, షాన్ మార్ష్, సెహ్వాగ్, మురళీ విజయ్‌లు కీలక ఆటగాళ్లు. నాణ్యమైన స్థానిక పేస్ బౌలర్లు లేకపోవడం జట్టుకు లోటుగా కనిపిస్తోంది. ప్రస్తుత జట్టులో ఆరుగురు ఆల్‌రౌండర్లు ఉండటం అదనపు బలం.
ఓనర్లు: ప్రీతిజింతా, నెస్ వాడియా, మోహిత్ బర్మన్, కరణ్ పాల్
కెప్టెన్: బెయిలీ
కోచ్: సంజయ్ బంగర్, బౌలింగ్ కోచ్: జో డేవ్స్
గతంలో ఉత్తమ ప్రదర్శన: 2008 సెమీస్, 2014 రన్నరప్