సన్‌రైజర్స్ బలం పెరిగింది
ఈ సారి హైదరాబాద్‌కే చాన్స్
జట్టు విజయంపై టీమ్ మేనేజ్‌మెంట్ ధీమా
ఐపీఎల్ కోసం నేడు దుబాయ్‌కు పయనం
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది ఐపీఎల్‌లో ప్రవేశించిన తొలి సారే సన్‌రైజర్స్ హైదరాబాద్ చక్కటి ప్రదర్శన కనబర్చిందని, ఈ సారి తాము మరింత మెరుగైన క్రికెట్ ఆడతామని ఆ జట్టు కోచ్ టామ్ మూడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ధాటిగా ఆడే హిట్టర్ల రాకతో తమ జట్టు బ్యాటింగ్ బలం పెరిగిందని ఆయన అన్నారు.
ఐపీఎల్-7 తొలి దశలో పాల్గొనేందుకు సన్‌రైజర్స్ జట్టు శనివారం ఉదయం యూఏఈ బయల్దేరి వెళ్లనుంది. ఈ సందర్భంగా మూడీతో పాటు జట్టు మెంటర్స్ వీవీఎస్ లక్ష్మణ్, కె. శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. టీమ్‌కు నిర్వహించిన మూడు రోజుల స్వల్పకాలిక శిక్షణా శిబిరం శుక్రవారం ఇక్కడ ముగిసింది.
పిచ్‌లు సమస్య కాదు...
జట్టు మెంటర్ కె. శ్రీకాంత్ మాట్లాడుతూ...గత సంవత్సరం జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన పలువురు ఆటగాళ్లను కొనసాగించడం జట్టుకు ఉపయోగపడుతుందని అన్నారు. ‘ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాన బృందం అంతా ఇప్పుడు టీమ్‌లో కొనసాగుతోంది. మా ప్రదర్శన ఇంకా బాగుంటుందని నా నమ్మకం. దక్షిణాఫ్రికాలో ఆడి భారత్‌కు వస్తే కష్టమేమో గానీ యూఏఈ పిచ్‌లకు, భారత్‌కు పెద్దగా తేడా ఉండదు కాబట్టి సమస్య లేదు. గత ఏడాది వివాదాలతో ఇప్పుడు ఇబ్బంది లేదు’ అని ఆయన విశ్లేషించారు.
హిట్టర్లు చెలరేగుతారు...
మరో వైపు సన్‌రైజర్స్ సమతూకంగా ఉందని మరో మెంటర్ లక్ష్మణ్ అభిప్రాయ పడ్డారు. జట్టు అవసరాలకు అనుగుణంగానే ఆటగాళ్లను వేలంలో ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు. ‘మా టీమ్‌లో చక్కటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. పైగా వార్నర్, ఫించ్‌లాంటి కొంత మంది హిట్టర్లు ఇప్పుడు టీమ్‌తో చేరారు కాబట్టి తిరుగు లేదు. ఆటగాళ్ల మధ్య గత ఏడాది కనిపించిన సమన్వయం ఈ సారి కూడా కొనసాగుతుంది’ అని అన్నారు. వేలం జరిగే విధానంలో ఉండే పరిమితుల కారణంగానే హైదరాబాద్ స్థానిక ఆటగాళ్లు ఎక్కువ మందికి చోటు ఇవ్వలేకపోయామని ఆయన స్పష్టం చేశారు.
నాలుగో సింహం!
‘టాపార్డర్‌లో ధావన్, వార్నర్, ఫించ్ వంటి ముగ్గురు విధ్వంసక ఆటగాళ్లు ఉన్నారు సరే...నాలుగో ఆటగాడు అలాంటివాడే కావాలి. అవసరమైతే నేను ఆ స్థానంలో ఆడేందుకు రెడీ. నాకు షార్జాలో మంచి అనుభవం ఉంది. నా ఆఫ్ స్పిన్‌తో వన్డేల్లో రెండు సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టాను కూడా’...ఈ మాటలన్నది ఎవరో కాదు. ఒకప్పటి భారత స్టార్ ఓపెనర్, ఇప్పుడు సన్‌రైజర్స్ మెంటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఆయన ఎక్కడున్నా సరదా కబుర్లు, వ్యాఖ్యలతో వాతావరణం అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా మారిపోతుంది.
శుక్రవారం మీడియా సమావేశంలో కూడా ఆయన తనదైన శైలిలో నవ్వులు కురిపించారు. లక్ష్మణ్‌ను ఒకసారి జట్టుకు వైస్ ప్రెసిడెంట్ అని, మరో సారి డిప్యూటీ చైర్మన్ అని సంబోధించిన శ్రీకాంత్... మీడియా తరఫున తనే జట్టు సభ్యులకు ప్రశ్నలు సంధించారు.
ఈ క్రమంలో వచ్చీ రాని తెలుగులో వేణుగోపాలరావుతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. మరో వైపు ఇషాంత్, స్యామీ, మిశ్రాలను తన త్రీ మస్కటీర్స్ (ముగ్గురు యోధులు)గా ఆయన ప్రశంసించారు. దీనిపై స్పందిస్తూ ఇషాంత్...‘నిజమే, ఒకరు బాగా నలుపు, మరొకరు బాగా పొడవు, ఇంకొకరు బాగా పొట్టి’ అంటూ సమాధానమివ్వడం హాస్యాన్ని పంచింది.