విజయమే లక్ష్యంగా బరిలోకి...
►నేడు బెంగళూరుతో తలపడనున్న గుజరాత్
►వరుస ఓటములతో ఇరుజట్లు డీలా
►తిరిగి పుంజుకునేందుకు ప్రణాళికలు
రాజ్‌కోట్ : ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన గుజరాత్ లయన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరుగనుంది. ఇప్పటివరకు చెరో గెలుపు మాత్రమే ఇరుజట్లు నమోదు చేసుకున్నాయి. గుజరాత్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో.. బెంగళూరు ఐదు మ్యాచ్‌లు ఆడగా నాల్గింటిలో పరాజయం పాలయ్యాయి. మంగళవారం జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి గాడిలోపడాలని ఇరుజట్లు యోచిస్తున్నాయి.
సొంతగడ్డపైనే ఏకైక విజయం
గతేడాడి అరంగేట్రంలోనే మురిపించిన గుజరాత్ లయన్స్ ఈ సీజన్‌లో మాత్రం అంతంతమాత్రం ప్రదర్శననే కనబరుస్తోంది. తొలిరెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ విభాగం విఫలం కాగా.. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి చేరినా ప్రదర్శన మాత్రం మెరుగవ్వడంలేదు. చివరగా ముంబై ఇండియన్స్‌తో ఆడిన గుజరాత్.. బ్యాట్స్‌మెన్ రాణించడంతో భారీ స్కోరును నమోదు చేసింది. అయితే బౌలర్లు విఫలం కావడంతో ఆరు వికెట్లతో పరాజయం పాలైంది. ముఖ్యంగా పేసర్లలో అండ్రూ టై ఆకట్టుకుంటున్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనే ఏడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోపేసర్ ప్రవీణ్ కుమార్ పవర్ ప్లేలలో రాణించినా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక స్టార్ స్పిన్నర్ జడేజా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాడు. మరోవైపు స్పిన్నర్లు షాదాబ్ జకాతి, శివిల్ కౌశిక్ కూడా విఫలమవుతున్నారు.
దీంతో బౌలింగ్ తిరిగి గాడిలో పడాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. బ్యాటింగ్ విషయానికొస్తే భారత స్టార్ సురేశ్ రైనా, బ్రెండన్ మెకల్లమ్, ఆరోన్ ఫించ్, దినేశ్ కార్తిక్, డ్వేన్ స్మిత్‌లతో పటిష్టంగా కన్పిస్తోంది. సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ కేవలం రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండోస్థానంలో ఉంది. గుజరాత్ సాధించిన ఏకైక విజయం సొంతగడ్డపై నమోదు చేసింది. దీంతో బెంగళూరుతో మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఓవరాల్‌గా సాధ్యమైనంత త్వరగా గాడిలో పడి జట్టు తిరిగి గాడిన పడాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.
కోహ్లి వచ్చినా..
మరోవైపు రాయల్ చాలెంజర్స్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చినా టీమ్ రాత మారలేదు. చివరగా రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. కోహ్లి, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్ లాంటి భీకర బ్యాట్స్‌మన్ ఉన్నా ఫలితం లేకపోయింది. ఏ ఒక్కరు కాసేపు నిలబడినా జట్టు విజయం సాధించేదనడంలో సందేహం లేదు. మరోవైపు స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ వరుసగా విఫలమవుతుండడంతో జట్టులో చోటు కోల్పోయాడు.
తను చివరి రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగలేదు. ఈ పరిస్థితుల్లో జట్టు కూర్పుపై యాజమాన్యం తంటాలు పడుతోంది. బౌలింగ్ విషయానికొస్తే తైమల్ మిల్స్, బిల్లీ స్టాన్‌లకే, యజ్వేంద్ర చహల్, శ్రీనాథ్ అరవింద్, శామ్యూల్ బద్రీలు ఆకట్టుకుంటున్నారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బద్రీ హ్యాట్రిక్ నమోదు చేసినా జట్టు ఓటమిపాలైంది. వీలైనంత త్వరగా జట్టు గెలుపుబాటలోకి రావాలని యాజమాన్యం ఆశిస్తోంది.