విధ్వంసం ‘డబుల్’
► శతకాలతో విరుచుకుపడిన విరాట్, డివిలియర్స్
► గుజరాత్‌పై 144 పరుగులతో బెంగళూరు ఘన విజయం
బెంగళూరు: ప్రతి మ్యాచ్ చావో రేవో... రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాలి... మామూలు మ్యాచ్‌ల్లోనే విధ్వంసం సృష్టించే బెంగళూరు స్టార్స్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురైతే... ఇక ఆ విధ్వంసాన్ని ఆపడం ఎవరితరం కాదేమో..! ఏబీ డివిలియర్స్ (52 బంతుల్లో 129 నాటౌట్; 10 ఫోర్లు, 12 సిక్సర్లు), విరాట్ కోహ్లి (55 బంతుల్లో 109; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి రికార్డుల మోత మోగించడంతో... గుజరాత్ లయన్స్‌పై బెంగళూరు 144 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 248 పరుగులు చేసింది. గుజరాత్ లయన్స్ 18.4 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడిపోయింది. ఫించ్ (38 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్సర్) మినహా ఎవరూ రాణించలేకపోయారు. బెంగళూరు బౌలర్లు జోర్డాన్ (4/11), చాహల్ (3/19) రాణించారు. డివిలియర్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఒకరిని మించి మరొకరు...
పేలవ ఫామ్‌లో ఉన్న గేల్ (6)ను నాలుగో ఓవర్లో అవుట్ చేసి గుజరాత్ సంబరపడింది. కానీ ఏబీ డివిలియర్స్ ఆరంభం నుంచే విధ్వంసం సృష్టించాడు. మరోవైపు సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి సంయమనంగా ఆడటంతో పవర్‌ప్లేలో బెంగళూరు వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. 11వ ఓవర్‌లో వరుసగా సిక్సర్, రెండు బౌండరీలతో విరుచుకపడ్డ డివిలియర్స్ 25 బంతుల్లోనే అర్ధసెంచరీని అందుకున్నాడు. ఆతర్వాత మరింత రెచ్చిపోయిన ఏబీని చూస్తూ ఉండటం తప్ప ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు. అదే జోరులో 5 సిక్సర్లు, 3 ఫోర్లు బాది 43 బంతుల్లోనే వేగంగా సెంచరీ చేశాడు. మరో ఎండ్‌లో 40 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తిచేసుకున్న విరాట్ కూడా గేర్ మార్చి బ్యాట్‌ను ఝుళిపించాడు. చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 112 పరుగులు రావడంతో బెంగళూరు భారీస్కోరు సాధించింది.
ఒత్తిడిలో చిత్తుగా...
249 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. బౌండరీతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్మిత్ (7) రెండో ఓవర్లో ఔట్ కావడంతో గుజరాత్‌కు తొలి షాక్ తగిలింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన జడేజా (19 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా... మరో ఎండ్‌లో కెప్టెన్ మెకల్లమ్ (13 బంతుల్లో 11; 2 ఫోర్లు) నిరాశపరిచాడు. ఏడో ఓవర్‌లో రెండు వరుస బంతుల్లో కార్తీక్ (2), జడేజాలను జోర్డాన్ పెవిలియన్‌కు పంపాడు. బ్రేవో (1) కూడా విఫలం కావడంతో 10 ఓవర్లలో ఐదు వికెట్లకు 54 పరుగులతో గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఫించ్ కొద్దిసేపు నిలబడ్డా... రెండో ఎండ్‌లో నాథ్ (3), ప్రవీణ్‌కుమార్ (1), ధవల్ (2) వెంటవెంటనే అవుటయ్యారు. 19 వ ఓవర్‌లో సచిన్ బేబి... ఫించ్, కౌశిక్‌లను ఔట్ చేయడంతో గుజరాత్ 104 పరుగులకే చాపచుట్టేసింది.
స్కోరు వివరాలు
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: గేల్ (బి) ధవల్ 6; కోహ్లి (సి) బ్రేవో (బి) కుమార్ 109; డివిలియర్స్ (నాటౌట్) 129; వాట్సన్ (సి) కార్తీక్ (బి) ప్రవీణ్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1-19; 2-248; 3-248.
బౌలింగ్: ప్రవీణ్ 4-1-45-2; ధవల్ 3-0-33-1; కౌశిక్ 3-0-50-0; తాంబే 2-0-25-0; బ్రేవో 3-0-46-0; జడేజా 4-0-34-0; స్మిత్ 1-0-13-0.
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) అరవింద్ 7; మెకల్లమ్ (సి) డివియర్స్ (బి) చాహల్ 11; జడేజా (సి) అండ్ (బి) జోర్డాన్ 21; కార్తీక్ (సి) డివిలియర్స్ (బి) జోర్డాన్ 2; ఫించ్ (సి)అరవింద్ (బి)సచిన్‌బేబి 37; బ్రేవో ఎల్బీడబ్ల్యు (బి) చాహల్ 1; నాథ్ (బి) చాహల్ 3; ప్రవీణ్ (బి) జోర్డాన్ 1; ధవల్ (బి) జోర్డాన్ 2; తాంబే నాటౌట్ 7; కౌశిక్ (సి) అరవింద్ (బి) సచిన్ బేబి 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 104.
వికెట్ల పతనం: 1-9; 2-37; 3-44; 4-44; 5-47; 6-68; 7-69; 8-74; 9-104; 10- 104.
బౌలింగ్: బిన్నీ 2-0-13-0; అరవింద్ 3-0-15-1; చాహల్ 4-0-19-3; వాట్సన్ 1-0-3-0; జోర్డాన్ 3-0-11-4; ఆరోన్ 2-0-19-0; కోహ్లి 1-0-13-0; గేల్ 2-0-3-0; సచిన్ బేబీ 0.4-0-4-2.