హర్షా భోగ్లే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లు లీగ్ మ్యాచ్‌ల్లో ఇప్పటికి రెండు సార్లు తలపడ్డాయి. ప్రతీసారి లయన్స్ జట్టును విరాట్ కోహ్లి వెంటాడాడు. తొలిసారి రాజ్‌కోట్‌లో ఆడినప్పుడు కోహ్లి 63 బంతుల్లో శతకం బాదాడు. ఇక రెండోసారి బెంగళూరులో ఆడగా ఇక్కడ కూడా తను 55 బంతుల్లోనే 109 పరుగులతో అదరగొట్టాడు. అటు డి విలియర్స్ కూడా ప్రతాపం చూపడంతో లయన్స్ కుదేలైంది. కానీ ఈసారి తొలి క్వాలిఫయర్‌లో ఆడేందుకు లయన్స్ పూర్తి ఆత్మవిశ్వాసంతో మరోసారి బెంగళూరుకు చేరింది. కెప్టెన్ రైనా ఫుల్ ఫామ్‌లో ఉండగా డ్వేన్ స్మిత్ బంతితో కూడా అద్భుతాలు చేస్తున్నాడు. మెకల్లమ్ కూడా మెరుపులు మెరిపిస్తుండగా దినేశ్ కార్తీక్ ప్రమాదకార ఆటగాడే. నిజానికి క్వాలిఫయర్‌పై ఆశలు లేని స్థితి నుంచి ఫేవరెట్‌గా మారిన బెంగళూరును ఎదుర్కోవాలంటే ప్రతీ జట్టు కూడా తమ శక్తికి మించి ప్రదర్శన చేయాల్సిందే.
బౌలింగ్ బలం ఎంత ఉన్నా చిన్నస్వామిలాంటి స్టేడియంలో బెంగళూరుతో మ్యాచ్ అంటే కనీసం 190 పరుగుల లక్ష్యానికి సిద్ధంగా ఉండాలి. ఒక్కోసారి ఇది పెరగవచ్చు. అయితే మంచి స్ట్రోక్ ప్లేయర్స్‌తో ఉన్న లయన్స్ కూడా తొలి బంతి నుంచే విరుచుకుపడి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని ఇస్తే బావుంటుంది. మరోవైపు ఆర్‌సీబీకి కెప్టెన్ కోహ్లి ఫామ్ కాకుండా చాలా విషయాల్లో అనుకూలతలున్నాయి. క్రిస్ జోర్డాన్ రాకతో పాటు శ్రీనాథ్ అరవింద్, యజువేంద్ర చాహల్‌లతో కూడిన బౌలింగ్ విభాగం మెరుగ్గా రాణిస్తోంది. షేన్ వాట్సన్ ఒక్కడే స్థాయికి తగ్గట్టుగా ఆకట్టుకోలేకపోతున్నాడు.
ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఇతర జట్లకన్నా ఎక్కువగానే బెంగళూరు చావోరేవో లాంటి మ్యాచ్‌లు ఆడింది. దీంతో ఒత్తిడిని ఎదుర్కోవడం వారికి అలవాటైంది. భారీ లక్ష్య ఛేదనలో ఒకవేళ కోహ్లి తొలి రెండు ఓవర్లలోనే అవుటైతే తప్ప వీరికి సమస్య ఎదురుకాకపోవచ్చు. కానీ ఆ తర్వాత కూడా సూపర్ బ్యాట్స్‌మెన్ ఉన్నా ఛేజింగ్‌లో కోహ్లికున్న సామర్థ్యం వీరికి లేదు. అయితే మూడు వారాల క్రితం ఈ జట్టు గురించి ఇలా మాట్లాడుకునే పరిస్థితి లేకున్నా ప్లే ఆఫ్‌లో వారు ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతున్నారు.
బెంగళూరే ఫేవరెట్
Published Tue, May 24 2016 12:11 AM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM
Advertisement