లండన్: ప్రపంచ కప్ సమరాంగణంలో తొలి సన్నాహకానికి భారత్ సిద్ధమైంది. ఓవల్ మైదానంలో నేడు జరిగే తమ మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో కోహ్లి సేన తలపడుతుంది. కొన్నాళ్ల క్రితం న్యూజిలాండ్ గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో ఈ రెండు టీమ్‌లు ఆడాయి. మ్యాచ్ ఫలితం టోర్నీపై ఎలాంటి ప్రభావం చూపకున్నా... తాజా వరల్డ్ కప్ ఫార్మాట్‌లో అన్ని టీమ్‌లతో ఆడే అవకాశం ఉండటంతో ఇరు జట్లకు కూడా ప్రత్యర్థి బలాబలాలపై అవగాహనకు ఈ మ్యాచ్ ఉపకరిస్తుంది.
ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ను 15 మంది ఆటగాళ్లు (మ్యాచ్‌లో 11 మంది బ్యాటింగ్, 11 మంది బౌలింగ్ చేయవచ్చు) కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. అందుకే ఎవరికీ విశ్రాంతినివ్వకుండా బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరినీ పరీక్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలుగో స్థానంలో తీవ్ర చర్చ సాగిన నేపథ్యంలో దానిపై కూడా టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టనుంది.
కేదార్ ప్రాక్టీస్ ...
ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు రోజు భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. నెట్స్‌లో సాధన చేస్తున్న సమయంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కుడి చేతికి గాయమైంది. పేసర్ ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని పుల్ చేసే క్రమంలో శంకర్ దెబ్బ తగిలించుకున్నాడు. నొప్పితో విలవిల్లాడిన అతను వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. అనంతరం గాయాన్ని నిర్ధారించిన టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి స్కానింగ్ చేయించాల్సి ఉందని ప్రకటించింది. మరో వైపు గాయంనుంచి కోలుకుంటున్న కేదార్ జాదవ్ కూడా రెండు రోజుల పాటు స్వల్పంగా ప్రాక్టీస్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment