కబడ్డీ... కబడ్డీ...
నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్
సాక్షి, విశాఖపట్నం: సాగరతీరంలో మరో క్రీడా సంరంభానికి రంగం సిద్ధమైంది. ప్రొ కబడ్డీ లీగ్ మూడో సీజన్ నేడు విశాఖపట్నంలో ప్రారంభం కాబోతోంది. మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్న ఈ లీగ్‌లో 60 మ్యాచ్‌లు జరుగుతాయి. న్యూఢిల్లీలో మార్చి 5న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. శనివారం జరిగే లీగ్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబాతో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. శనివారమే జరిగే రెండో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్ తలపడతాయి. జైపూర్, పుణే, పట్నా, బెంగాల్ లీగ్‌లో బరిలోకి దిగుతున్న మిగిలిన నాలుగు జట్లు. విశాఖపట్నంలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 2 వరకు పోటీలు జరుగుతాయి.
ఈ నాలుగు రోజులూ ప్రతి రోజూ తెలుగు టైటాన్స్ మ్యాచ్ ఉంటుంది. ప్రొ కబడ్డీ లీగ్ తొలి సీజన్‌లో వైజాగ్‌లో మ్యాచ్‌లు జరగ్గా... రెండో సీజన్‌లో హైదరాబాద్‌లో పోటీలు జరిగాయి. మూడో సీజన్ కూడా షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో జరగాల్సి ఉన్నా... జీహెచ్‌ఎంసీ ఎన్నికల కారణంగా వైజాగ్‌కు వేదికను మార్చారు.
తెలుగు టైటాన్స్ ఈసారైనా...
ప్రొ కబడ్డీ తొలి సీజన్‌లో ఐదో స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్... రెండో సీజన్‌లో లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచినా సెమీస్‌లో ఓడిపోయింది. ఈసారైనా టైటిల్ సాధించాలని కసితో ఉన్న ఈ జట్టుకు మరోసారి స్టార్ ఆటగాడు రాహుల్ చౌదురి కీలకం. సుఖేవ్ హెగ్డేతో పాటు ఇరాన్‌కు చెందిన మెరాజ్ షేక్ కూడా రాణిస్తే జట్టు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
రా. గం. 8.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం