వెటెల్... తొలిసారి
ఈ సీజన్‌లో మొదటి ‘పోల్ పొజిషన్’
నేడు సింగపూర్ గ్రాండ్‌ప్రి
సింగపూర్ : ఎట్టకేలకు ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ల జోరుకు కళ్లెం వేయడంలో ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ సఫలమయ్యాడు. శనివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో ఫెరారీ డ్రైవర్ వెటెల్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. వెటెల్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 43.885 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచి ఈ ఏడాది తొలిసారి ‘పోల్ పొజిషన్’ అవకాశాన్ని సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును వెటెల్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్ డ్రైవర్లు హామిల్టన్, రోస్‌బర్గ్ వరుసగా ఐదు, ఆరు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు.
ఈ సీజన్‌లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, నికో రోస్‌బర్గ్ కాకుండా మరో డ్రైవర్ ‘పోల్ పొజిషన్’ పొందడం ఇదే తొలిసారి. వెటెల్ ప్రదర్శనతో మెర్సిడెస్ జట్టుకు రెండు ఘనతలు చేజారాయి. ఒకవేళ ఈసారి మెర్సిడెస్‌కు ‘పోల్’ దక్కి ఉంటే... 1992, 1993 లో విలియమ్స్ జట్టు తర్వాత వరుసగా 23 రేసుల్లో ఈ ఘనత సాధిం చిన జట్టుగా మెర్సిడెస్ నిలిచేది. వరుసగా ఎనిమిది ‘పోల్ పొజిషన్స్’తో అయర్టన్ సెనా నెలకొల్పిన రికార్డును హామిల్టన్ సమం చేయలేకపోయాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ 11వ, పెరెజ్ 13వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు.
నేటి ప్రధాన రేసు
సాయంత్రం గం. 5.25 నుంచి
స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం