జోరు కొనసాగిస్తారా..? | today sunrisers faced delhi daredevils | Sakshi
Sakshi News home page

జోరు కొనసాగిస్తారా..?

Published Mon, May 1 2017 10:48 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

జోరు కొనసాగిస్తారా..?

జోరు కొనసాగిస్తారా..?

నేడు ఢిల్లీతో హైదరాబాద్‌ ఢీ
వరుస విజయాలతో ఉత్సాహంలో సన్‌రైజర్స్‌
ఓటములతో డేర్‌డెవిల్స్‌ డీలా


న్యూఢిల్లీ: వరుస విజయాలతో జోరుమీదున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మంగళవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఢీకొననుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే కోల్‌కతాను వెనక్కినెట్టి హైదరాబాద్‌ రెండోస్థానానికి ఎగబాకుతుంది. తమ చివరిమ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన ఢిల్లీ ఈ మ్యాచ్‌లో నెగ్గి  గాడిలో పడాలని భావిస్తోంది.

వార్నర్‌ హవా..
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రస్థానం ఘనంగా సాగుతోంది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో ఆ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓవరాల్‌గా తొమ్మిది మ్యాచ్‌ల నుంచి 459 పరుగులతో సత్తాచాటి టోర్నీలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దీంతో ‘ఆరెంజ్‌ క్యాప్‌’ను తన సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (341 పరుగులు), కేన్‌ విలియమ్సన్‌ (204 పరుగులు), మోజెస్‌ హెన్రిక్స్‌ (200) ఆకట్టుకుంటున్నారు. డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ గాడిలో పడాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్‌ లైనప్‌ ఉన్న జట్లలో సన్‌రైజర్స్‌ ఒకటి.

పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తొమ్మిది మ్యాచ్‌ల్లోనే 20 వికెట్లు తీసి ‘పర్పుల్‌ క్యాప్‌’ను కైవసం చేసుకున్నాడు. అఫ్గాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ (12 వికెట్లు), ఆశిష్‌ నెహ్రా (8), సిద్దార్థ్‌ కౌల్‌ (7) రాణిస్తున్నారు. మహ్మద్‌ సిరాజ్‌ కొత్త బంతితో ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్‌లో ఇరుజట్లు ఓ సారి పరస్పరం తలపడగా.. ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ విజయం సాధించింది. ఇదే జోరును మళ్లీ కొనసాగించాలని వార్నర్‌సేన భావిస్తోంది. ఓవరాల్‌గా పది మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ ఆరు విజయాలు, 3 పరాజయాలు నమోదు చేసింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. దీంతో 13 పాయింట్లతో పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీతో మ్యాచ్‌లో నెగ్గినట్లయితే పట్టికలో రెండోస్థానంలో నిలిచే అవకాశముంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోది.

ఢిల్లీ బేజారు..
మరోవైపు ఈ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటతీరు నానాటికి తీసికట్టుగా మారుతోంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో కేవలం 67 పరుగులకే కుప్పకూలింది. టోర్నీ చరిత్రంలో ఢిల్లీకిదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. జట్టులో బ్యాట్స్‌మెన్‌ బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కన్పిస్తోంది. మరోవైపు తొడకండరాల గాయంతో కెప్టెన్‌ జహీర్‌ ఖాన్‌ దూరమవడం జట్టును ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు ఇంగ్లండ్‌ ప్లేయర్లు సామ్‌ బిల్లింగ్స్, క్రిస్‌ మోరిస్,  దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబడ ఈ వారం నుంచి టీమ్‌ నుంచి వైదొలుగుతుండడంతో ఢిల్లీకి మరిన్ని కష్టాలు తోడవనున్నాయి.

ఢిల్లీ తరఫున అత్యుత్తమంగా నిలిచిన క్రిస్‌ మోరిస్‌ (12 వికెట్లు) జట్టుకు దూరమవడం పెద్ద దెబ్బె. అతని లోటును జహీర్, కమిన్స్‌ ఎలా తీర్చుతారో చూడాలి. బ్యాటింగ్‌ విషయానికొస్తే సంజూ శామ్సన్‌ 289 పరుగులతో అత్యుత్తమంగా నిలిచాడు. శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్‌ ఓ మాదిరిగా రాణిస్తున్నారు. కరుణ్‌ నాయర్, కోరే అండర్సన్‌ విఫలమవుతున్నారు. సాధ్యమైనంత త్వరగా వీరు గాడిలో పడాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లాడిన ఢిల్లీ కేవలం రెండు మ్యాచ్‌ల్లో నెగ్గగా.. ఆరు మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో నాలుగు పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

మరోవైపు ఢిల్లీ ఆడబోయే చివరి ఆరు మ్యాచ్‌ల్లో ఐదు సొంతగడ్డపైనే ఆడుతుండడం సానుకూలాంశం. వీటిలో సత్తాచాటితే ప్లే ఆఫ్‌ అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతీమ్యాచ్‌లో విజయం సాధించేందుకు బరిలోకి దిగాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ ప్లే ఆఫ్‌కు చేరడం చాలా కష్టమైనని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement