
టోక్యో ఒలింపిక్స్ ప్రధాన స్టేడియం
రెండు వందలకు పైగా దేశాల నుంచి దాదాపు పది వేల మంది అథ్లెట్లు... అంతకంటే ఎన్నో రెట్ల సంఖ్యలో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు... పక్షం రోజుల పాటు క్రీడా ప్రేమికులకు పండగ... ఇంతటి హంగామా ఉండే విశ్వ సంబరం ఒలింపిక్స్‌పై కూడా ఇప్పుడు ప్రమాదకర కరోనా (కోవిడ్–19) వైరస్ ప్రభావం పడనుందా... జూలై–ఆగస్టుల్లో జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన 2020 మెగా ఈవెంట్ వాయిదా పడుతుందా లేక మొత్తానికే రద్దవుతుందా... ఇద్దరు మనుషులు కలిసినప్పుడు షేక్ హ్యాండ్‌లు ఇవ్వడం కూడా ప్రమాదంగా భావిస్తున్న ప్రస్తుత స్థితిలో వేల సంఖ్యలో జనం గుమిగూడే ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యమా...? అసలు ఆ సాహసం నిర్వాహకులు చేయగలరా!
టోక్యో: కరోనా వైరస్ (కోవిడ్–19) దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ప్రముఖ క్రీడా ఈవెంట్లు రద్దు కావడమో లేక వాయిదా పడటమో జరుగుతున్నాయి. ప్రతీ రోజు ఎక్కడో ఒక క్రీడాంశానికి సంబంధించి ఇలాంటి వార్త వస్తూనే ఉంది. అయితే వీటన్నింటిని మించి ఇప్పుడు అందరి దృష్టి టోక్యో ఒలింపిక్స్‌పై పడింది. యూరోపియన్ దేశాలతో పోలిస్తే ఆసియా ఖండంలో విస్తృతంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒలింపిక్స్ వేదిక జపాన్ కావడంతో కొత్త సందేహాలు తలెత్తుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో ఒలింపిక్స్ క్రీడలు జరగాల్సి ఉన్నాయి. ఇప్పుడు స్వయంగా ఆ దేశ పార్లమెంట్‌లో మంత్రి ఇచ్చిన వివరణ కొత్తగా ఆందోళనను రేకెత్తిస్తోంది. పార్లమెంట్‌లో ఒక ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ జపాన్ ఒలింపిక్ మంత్రి సీకో హషిమొటో కీలక వ్యాఖ్య చేశారు. ‘ఒలింపిక్స్ నిర్వహణకు ఉద్దేశించిన క్యాలెండర్ సంవత్సరం ముగిసే వరకు వాటిని మళ్లీ మళ్లీ వాయిదా వేసేందుకు నిర్వాహక కమిటీకి హక్కు ఉంటుంది.
అయితే 2020లో గనక మనం నిర్వహించలేకపోతే నిబంధనల ప్రకారం క్రీడలను పూర్తిగా రద్దు చేసే అధికారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి ఉంది’ అని ఆయన ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం జూలై 24 నుంచి మాత్రం నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని మంత్రి వ్యాఖ్యల్లో పరోక్షంగా వినిపించింది. కరోనా వైరస్ కారణంగా రాబోయే రోజుల్లో పరిస్థితి మరింతగా దిగజారితే అప్పుడేం చేస్తారనే ప్రశ్నకు కూడా మంత్రి సమాధానమిచ్చారు. అలాంటి పరిస్థితి రాకుండా తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. నిర్వాహక కమిటీ, ఐఓసీ, జపాన్ ప్రభుత్వం కలిసి దీనిపై పని చేస్తున్నాయని మంత్రి చెప్పారు. హషిమొటో అంచనా ప్రకారం క్రీడల నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఐఓసీ మే నెలను డెడ్‌లైన్‌గా పెట్టుకుంది. అదే నెల చివరి వరకు ఎదురు చూసి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఒలింపిక్స్‌పై ప్రకటన రావచ్చు. ఒలింపిక్స్ చరిత్రలో మూడు సార్లు మాత్రమే ప్రపంచ యుద్ధాల కారణంగా క్రీడలు (1916, 1940, 1944) రద్దయ్యాయి.
థామస్ బాచ్
టెస్టు ఈవెంట్‌లు రద్దు!
ఒలింపిక్స్ నిర్వహణకు ముందు జరిగే పలు టెస్టు ఈవెంట్లను నిర్వాహకులు తప్పనిసరి పరిస్థితుల్లో రద్దు చేయాల్సి వస్తోంది. రాబోయే కొన్ని వారాల పాటు ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో వచ్చే ఎలాంటి ఈవెంట్లు జరపరాదని దేశ ప్రధాని షింజో అబె ఆదేశించారు. మంగళవారం పారాలింపిక్ వీల్‌చైర్ రగ్బీ టెస్టు ఈవెంట్ రద్దయింది. షెడ్యూల్ ప్రకారం మే 8లోగా మరో 17 విభిన్న క్రీడాంశాల్లో టెస్టు ఈవెంట్లు జరగాల్సి ఉంది. వీటిలో ఎక్కువ భాగం చిన్నవి కావడం, స్థానిక అథ్లెట్లతోనే కావడంతో ఇబ్బంది లేదు. అయితే ప్రధానమైన జిమ్నాస్టిక్స్ ఈవెంట్‌ను మాత్రం జపాన్ ఆటగాళ్లతోనే ముగించే అవకాశం ఉంది. జపాన్ బేస్‌బాల్ లీగ్ పోటీలు కూడా ప్రేక్షకులు లేకుండానే సాగుతుండగా, సాకర్ జె లీగ్ కూడా రద్దయింది. ఆదివారం టోక్యో మారథాన్‌ను నిర్వహించారు. సాధారణంగా 30 వేల మంది హాజరయ్యే మారథాన్‌కు ఈసారి వేయి మంది కూడా రాలేదు. మరోవైపు ఐఓసీ మాత్రం టోక్యో ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు తమ సన్నాహాలు కొనసాగుతున్నాయని ప్రకటించడం విశేషం. లుసానేలో జరిగిన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం అధ్యక్షుడు థామస్ బాచ్ మాట్లాడుతూ...‘తుది నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం ఉంది. ఆలోగా మా ఏర్పాట్లు చేసుకుంటూ సిద్ధంగా ఉండాలి కదా’ అని అన్నారు.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి నాలుగేళ్ల కాలంలో వచ్చే 5.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 42 వేల కోట్లు) ఆదాయంలో 75 శాతం ప్రసార హక్కులు విక్రయించడం ద్వారానే లభిస్తుంది. ఇందులో సగం అమెరికాకు చెందిన టీవీ నెట్‌వర్క్ నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఎన్‌బీసీ) నుంచే వస్తోంది. ఎన్‌బీసీ ప్రసారాల సౌకర్యం కోసమే ఒలింపిక్స్‌ను జూలై–ఆగస్టులో నిర్వహిస్తున్నారు. 1964లో టోక్యో ఒలింపిక్స్ అక్టోబరులో జరిగాయి. 2020లో మిగిలిన ఏడాది ఇతర ప్రముఖ క్రీడా ఈవెంట్లతో ఎన్‌బీసీ షెడ్యూల్ బిజీగా ఉంది. ఇప్పుడు ఒలింపిక్స్ నిర్వహణ తేదీల్లో తేడా వస్తే ఆర్థికపరంగా కూడా ఐఓసీకి భారీ నష్టం జరగవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment