
షాట్ పుట్ క్రీడాకారుడు ఇంద్రజిత్ సింగ్(ఫైల్)
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశం ఉన్న ఆటగాళ్లకు మరింత అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం ఆశించిన దిశగా ముందుకు సాగడం లేదు. ఇందుకు 'టాప్' లో చోటు దక్కిన పలువురు ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురుకావడమే. తొలుత ఎంతో గొప్పగా టాప్ పథకంలో కొంతమంది ఆటగాళ్ల పేర్లను చేర్చినా.. వారికి అత్యుత్తమ శిక్షణ ఇప్పించేందుకు నిధులు కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. సాధారణంగా టాప్ లో చోటు దక్కించుకున్నఆటగాళ్ల అత్యుత్తమ శిక్షణ కోసం భారీగా నిధులు విడుదల చేయాల్సి ఉంది.
ఇలా టాప్ లో చోటు దక్కిన తరువాత నలుగురు ఆటగాళ్ల పేర్లను క్రీడా మంత్రిత్వ శాఖ పక్కకు పెట్టేసినట్లు సమాచారం. వారిలో షాట్ పుట్ క్రీడాకారుడు ఇంద్రజిత్ సింగ్, రేస్ వాకర్ కుష్బీర్ కౌర్, బాక్సర్ పింకీ జంగ్రా, ట్రిపుల్ జంపర్ అర్పిందర్ సింగ్ లు ఉన్నారు. ఆటగాళ్ల నైపుణ్యాన్ని మరింత పదును పెట్టేందుకు ఏర్పాటు చేసినదే టాప్ పథకం. దశల వారీగా 75 మంది ప్రతిభగలక్రీడాకారులను ఎంపిక చేసి వారికి అత్యుత్తమ శిక్షణ ఇప్పించడమే టాప్ పథకం యొక్క లక్ష్యం. వీరికి 40 నుంచి 45 కోట్ల వరకూ నిధులు కేటాయించాల్సి ఉంది.
ఇటీవల టాప్ పథకంలో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జంట సుమీత్ రెడ్డి, మను అత్రిలకు చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనూ అత్రి జతగా ఇటీవల కాలంలో అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తుండటంతో వారికి టాప్ లో స్థానం కల్పించారు. వీరితో పాటు ఇన్నాళ్లుగా ‘టాప్’లో చోటు కోసం నిరసన గళం వినిపిస్తున్న మహిళల డబుల్స్ జంట గుత్తా జ్వాల, అశ్వినిలకు కూడా చోటు దక్కిన సంగతి తెలిసిందే.