ఆక్లాండ్: గత కొన్నేళ్లుగా టీ 20 ఫార్మాట్ క్రికెట్ ప్రపంచాన్ని అలరిస్తుంటే, ఇంగ్లండ్ క్రికెట్ ప్రధాన కోచ్ ట్రేవర్ బేలీస్ మాత్రం తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. అసలు అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లు అనేవి దాదాపు అనవసరమనే అర్ధం వచ్చేలా ధ్వజమెత్తాడు. ఆటగాళ్లకు, కోచ్‌లకు అదనపు భారంగా మారిపోతున్న టీ 20 మ్యాచ్‌లను అంతర్జాతీయ షెడ్యూల్ నుంచి తొలగిస్తే మంచిదంటూ క్రికెట్ పరిపాలకులు ఉచిత సలహా పారేశాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత బెయిలీస్ మాట్లాడుతూ.. ట్వంటీ 20 ఫార్మాట్‌ను ఫ్రాంచైజీల గేమ్‌గా చూడాలన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్) మాదిరి దేశవాళీ మ్యాచ్‌లకే టీ 20 క్రికెట్‌ను పరిమితం చేయాలన్నాడు.
'నేనైతే అంతర్జాతీయ టీ 20 గేమ్ ఆడను. అదొక ఫ్రాంచైజీ గేమ్. దాన్ని అలా చూస్తేనే మంచిది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌ల సంఖ్య పెరిగిపోతుంది. ఇది క్రికెటర్లకు అదనపు భారం. టెస్టు, వన్డే, టీ 20 గేమ్‌లను మేనేజ్ చేసుకుంటూ ఆడటం చాలా కష్టం. ఆటగాళ్లకే కాదు.. కోచ్‌లకు కూడా ఇబ్బందికరమే. అంతర్జాతీయ మ్యాచ్‌లను బాగా తగ్గించండి. కేవలం టీ 20 వరల్డ్ కప్‌కు ఆరు నెలల ముందే టీ 20 గేమ్‌లు ఆడిస్తే మంచిది. ఒక టీ 20 వరల్డ్ కప్‌ను ఎప్పుడూ నిర్వహించినా దానికి ముందు మాత్రమే టీ 20 మ్యాచ్‌లు నిర్వహించండి. దాంతో క్రికెటర్లకు భారం తగ్గినట్లు అవుతుంది' అని బెయిలీస్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment