'వాకా' వాకిట్లో బోల్తా! | Tri-out from the tournament in India | Sakshi
Sakshi News home page

'వాకా' వాకిట్లో బోల్తా!

Published Sat, Jan 31 2015 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

'వాకా' వాకిట్లో  బోల్తా!

'వాకా' వాకిట్లో బోల్తా!

ముక్కోణపు టోర్నీ నుంచి భారత్ అవుట్
     
ఫైనల్ చేరని టీమిండియా
చివరి లీగ్ మ్యాచ్‌లో ఓటమి
3 వికెట్లతో నెగ్గిన ఇంగ్లండ్
రాణించిన టేలర్, బట్లర్

 
వికెట్ కోల్పోకుండా 83 పరుగులు. భారత్‌కు లభించిన ఆరంభమిది. మరో 117 పరుగులకు మొత్తం టీమ్ పెవిలియన్ చేరిపోయింది. ఇది మన బ్యాటింగ్ వైఫల్యం. 66 పరుగులకే ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. కానీ విజయం మాత్రం వారి పక్షాన నిలిచింది. ఇది మన బౌలర్ల నిలకడలేమి.
 
అతి జాగ్రత్తతో మొదలై, ఆ తర్వాత తడబడుతూ సాగి, కాస్త నిర్లక్ష్యం కూడా తోడై భారత్ ఇన్నింగ్స్‌ను దెబ్బ తీస్తే... అనుభవం తక్కువైనా, కీలక సమయంలో ఆచితూచి ఆడి నెలకొల్పిన భాగస్వామ్యం ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చింది. భారత్‌కు ఈ  పర్యటనలో ఒక్క విజయమూ లేకుండా చేసింది.
 
{పపంచకప్‌కు సన్నాహకం అంటూ హోరెత్తించిన టోర్నీ నుంచి భారత్ నిష్ర్కమించింది. నిజంగా అలసటో, ఓడినా పోయేదేముందని భావించారో మొత్తానికి మన జట్టు ఆట మాత్రం అన్ని రంగాల్లో తీసికట్టుగా అనిపించింది. స్పష్టత లేని బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ వైఫల్యం, జట్టు కూర్పులో సమస్య... ఇలా సమాధానం దొరకని శేష ప్రశ్నలతోనే మన సాధన ముగిసింది. ఇక నేరుగా ప్రపంచ కప్ బరిలోకి దిగడమే మిగిలింది.
 
పెర్త్: ముక్కోణపు వన్డే టోర్నీలో భారత్ ఫైనల్ చేరడంలో విఫలమైంది. శుక్రవారం ఇక్కడి వెస్టర్న్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (వాకా) మైదానంలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. రెండు విజయాలతో 9 పాయింట్లు పొందిన ఇంగ్లండ్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో పోరుకు సిద్ధమైంది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.1 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. రహానే (101 బంతుల్లో 73; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. శిఖర్ ధావన్ (65 బంతుల్లో 38; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఇంగ్లండ్ లక్ష్య ఛేదనలో కాస్త తడబడినా 46.5 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసి విజయాన్నందుకుంది. జేమ్స్ టేలర్ (122 బంతుల్లో 82; 4 ఫోర్లు), బట్లర్ (78 బంతుల్లో 67; 7 ఫోర్లు) ఆరో వికెట్‌కు 125 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బిన్నీకి 3 వికెట్లు దక్కాయి.

ఓపెనింగ్ మినహా: ఘోరంగా విఫలమవుతూ వస్తున్న శిఖర్ ధావన్ ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో కాస్త నిలకడ ప్రదర్శించాడు. సున్నా వద్దే రనౌట్ నుంచి తప్పించుకున్న ధావన్, ఆ తర్వాత  రహానేతో కలిసి ఎటువంటి సాహసాలు చేయకుండా జాగ్రత్తగా ఆడాడు. ఫలితంగా పవర్ ప్లేలో జట్టు 34 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే 21వ ఓవర్లో ధావన్‌ను అవుట్ చేసి వోక్స్ ఇంగ్లండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. అంతే... ఆ తర్వాత ఏ దశలోనూ జట్టు ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. మళ్లీ మూడో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి (8), సురేశ్ రైనా (1)లను వరుస ఓవర్లలో అవుట్ చేసి మొయిన్ అలీ భారత్‌ను దెబ్బ తీశాడు. అంబటి రాయుడు (12) కూడా ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. మరోవైపు 71 బంతుల్లో రహానే అర్ధ సెంచరీ పూర్తయింది. ఇంగ్లండ్ బౌలర్లు చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. బెల్ అద్భుత క్యాచ్‌తో బిన్నీ (7), నిర్లక్ష్యంగా ఆడి జడేజా (5) అవుట్ కాగా, ధోని (17) వికెట్ల ముందు దొరికిపోయాడు.చివర్లో షమీ (18 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో స్కోరు 200కు చేరింది.

కీలక భాగస్వామ్యం: స్వల్ప విజయలక్ష్యమే అయినా ఇంగ్లండ్‌కు విజయం సులువుగా దక్కలేదు.  ఫామ్‌లో ఉన్న బెల్ (10)ను చక్కటి బంతితో మోహిత్ అవుట్ చేయగా, అక్షర్ బౌలింగ్‌లో అలీ (17) వెనుదిరిగాడు. ఈ దశలో స్టువర్ట్ బిన్నీ చెలరేగాడు. తాను వేసిన నాలుగు ఓవర్ల వ్యవధిలో అతను మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లం డ్‌ను ఇబ్బందుల్లో పడేశాడు. అయితే టేలర్, బట్లర్ భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. 21 పరుగుల వద్ద బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో రైనా వదిలేయడం వారికి కలిసొచ్చింది. గెలుపునకు చేరువగా వచ్చాక వీరిద్దరు అవుటైనా, ఇబ్బంది లేకుండా మరో 19 బం తులు ఉండగానే ఇంగ్లండ్ మ్యాచ్ సొంతం చేసుకుంది.  
 
స్కోరు వివరాలు

భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) బట్లర్ (బి) ఫిన్ 73; ధావన్ (సి) బట్లర్ (బి) వోక్స్ 38; కోహ్లి (సి) రూట్ (బి) అలీ 8; రైనా (సి) వోక్స్ (బి) అలీ 1; రాయుడు (సి) బట్లర్ (బి) బ్రాడ్ 12; ధోని (ఎల్బీ) (బి) అండర్సన్ 17; బిన్నీ (సి) బెల్ (బి) ఫిన్ 7; జడేజా (సి) ఫిన్ (బి) బ్రాడ్ 5; పటేల్ (సి) బెల్ (బి) ఫిన్ 1; మోహిత్ (నాటౌట్) 7; షమీ (సి) బట్లర్ (బి) వోక్స్ 25; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (48.1 ఓవర్లలో ఆలౌట్) 200
 
వికెట్ల పతనం
: 1-83; 2-103; 3-107; 4-134; 5-136; 6-152; 7-164; 8-164; 9-165; 10-200; బౌలింగ్: అండర్సన్ 9-1-24-1; వోక్స్ 9.1-1-47-2; బ్రాడ్ 10-1-56-2; ఫిన్ 10-0-36-3; అలీ 10-0-35-2.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెల్ (ఎల్బీ) (బి) మోహిత్ 10; అలీ (సి) రాయుడు (బి) పటేల్ 17; టేలర్ (సి) బిన్నీ (బి) మోహిత్ 82; రూట్ (సి అండ్ బి) బిన్నీ 3; మోర్గాన్ (సి) ధావన్ (బి) బిన్నీ 2; బొపారా (సి) జడేజా (బి) బిన్నీ 4; బట్లర్ (సి) రాయుడు (బి) షమీ 67; వోక్స్ (నాటౌట్) 4; బ్రాడ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (46.5 ఓవర్లలో 7 వికెట్లకు) 201
 
వికెట్ల పతనం: 1-14; 2-40; 3-44; 4-54; 5-66; 6-191; 7-193; బౌలింగ్: బిన్నీ 8-0-33-3; మోహిత్ 10-1-36-2; షమీ 9-0-31-1; అక్షర్ పటేల్ 10-1-39-1; రవీంద్ర జడేజా 9.5-0-62-0.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement