the tri-series tournament
-
'వాకా' వాకిట్లో బోల్తా!
ముక్కోణపు టోర్నీ నుంచి భారత్ అవుట్ ఫైనల్ చేరని టీమిండియా చివరి లీగ్ మ్యాచ్‌లో ఓటమి 3 వికెట్లతో నెగ్గిన ఇంగ్లండ్ రాణించిన టేలర్, బట్లర్ వికెట్ కోల్పోకుండా 83 పరుగులు. భారత్‌కు లభించిన ఆరంభమిది. మరో 117 పరుగులకు మొత్తం టీమ్ పెవిలియన్ చేరిపోయింది. ఇది మన బ్యాటింగ్ వైఫల్యం. 66 పరుగులకే ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. కానీ విజయం మాత్రం వారి పక్షాన నిలిచింది. ఇది మన బౌలర్ల నిలకడలేమి. అతి జాగ్రత్తతో మొదలై, ఆ తర్వాత తడబడుతూ సాగి, కాస్త నిర్లక్ష్యం కూడా తోడై భారత్ ఇన్నింగ్స్‌ను దెబ్బ తీస్తే... అనుభవం తక్కువైనా, కీలక సమయంలో ఆచితూచి ఆడి నెలకొల్పిన భాగస్వామ్యం ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చింది. భారత్‌కు ఈ పర్యటనలో ఒక్క విజయమూ లేకుండా చేసింది. {పపంచకప్కు సన్నాహకం అంటూ హోరెత్తించిన టోర్నీ నుంచి భారత్ నిష్ర్కమించింది. నిజంగా అలసటో, ఓడినా పోయేదేముందని భావించారో మొత్తానికి మన జట్టు ఆట మాత్రం అన్ని రంగాల్లో తీసికట్టుగా అనిపించింది. స్పష్టత లేని బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ వైఫల్యం, జట్టు కూర్పులో సమస్య... ఇలా సమాధానం దొరకని శేష ప్రశ్నలతోనే మన సాధన ముగిసింది. ఇక నేరుగా ప్రపంచ కప్ బరిలోకి దిగడమే మిగిలింది. పెర్త్: ముక్కోణపు వన్డే టోర్నీలో భారత్ ఫైనల్ చేరడంలో విఫలమైంది. శుక్రవారం ఇక్కడి వెస్టర్న్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (వాకా) మైదానంలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. రెండు విజయాలతో 9 పాయింట్లు పొందిన ఇంగ్లండ్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో పోరుకు సిద్ధమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.1 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. రహానే (101 బంతుల్లో 73; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. శిఖర్ ధావన్ (65 బంతుల్లో 38; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఇంగ్లండ్ లక్ష్య ఛేదనలో కాస్త తడబడినా 46.5 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసి విజయాన్నందుకుంది. జేమ్స్ టేలర్ (122 బంతుల్లో 82; 4 ఫోర్లు), బట్లర్ (78 బంతుల్లో 67; 7 ఫోర్లు) ఆరో వికెట్‌కు 125 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బిన్నీకి 3 వికెట్లు దక్కాయి. ఓపెనింగ్ మినహా: ఘోరంగా విఫలమవుతూ వస్తున్న శిఖర్ ధావన్ ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో కాస్త నిలకడ ప్రదర్శించాడు. సున్నా వద్దే రనౌట్ నుంచి తప్పించుకున్న ధావన్, ఆ తర్వాత రహానేతో కలిసి ఎటువంటి సాహసాలు చేయకుండా జాగ్రత్తగా ఆడాడు. ఫలితంగా పవర్ ప్లేలో జట్టు 34 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే 21వ ఓవర్లో ధావన్‌ను అవుట్ చేసి వోక్స్ ఇంగ్లండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. అంతే... ఆ తర్వాత ఏ దశలోనూ జట్టు ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. మళ్లీ మూడో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి (8), సురేశ్ రైనా (1)లను వరుస ఓవర్లలో అవుట్ చేసి మొయిన్ అలీ భారత్‌ను దెబ్బ తీశాడు. అంబటి రాయుడు (12) కూడా ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. మరోవైపు 71 బంతుల్లో రహానే అర్ధ సెంచరీ పూర్తయింది. ఇంగ్లండ్ బౌలర్లు చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. బెల్ అద్భుత క్యాచ్‌తో బిన్నీ (7), నిర్లక్ష్యంగా ఆడి జడేజా (5) అవుట్ కాగా, ధోని (17) వికెట్ల ముందు దొరికిపోయాడు.చివర్లో షమీ (18 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో స్కోరు 200కు చేరింది. కీలక భాగస్వామ్యం: స్వల్ప విజయలక్ష్యమే అయినా ఇంగ్లండ్‌కు విజయం సులువుగా దక్కలేదు. ఫామ్‌లో ఉన్న బెల్ (10)ను చక్కటి బంతితో మోహిత్ అవుట్ చేయగా, అక్షర్ బౌలింగ్‌లో అలీ (17) వెనుదిరిగాడు. ఈ దశలో స్టువర్ట్ బిన్నీ చెలరేగాడు. తాను వేసిన నాలుగు ఓవర్ల వ్యవధిలో అతను మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లం డ్‌ను ఇబ్బందుల్లో పడేశాడు. అయితే టేలర్, బట్లర్ భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. 21 పరుగుల వద్ద బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో రైనా వదిలేయడం వారికి కలిసొచ్చింది. గెలుపునకు చేరువగా వచ్చాక వీరిద్దరు అవుటైనా, ఇబ్బంది లేకుండా మరో 19 బం తులు ఉండగానే ఇంగ్లండ్ మ్యాచ్ సొంతం చేసుకుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) బట్లర్ (బి) ఫిన్ 73; ధావన్ (సి) బట్లర్ (బి) వోక్స్ 38; కోహ్లి (సి) రూట్ (బి) అలీ 8; రైనా (సి) వోక్స్ (బి) అలీ 1; రాయుడు (సి) బట్లర్ (బి) బ్రాడ్ 12; ధోని (ఎల్బీ) (బి) అండర్సన్ 17; బిన్నీ (సి) బెల్ (బి) ఫిన్ 7; జడేజా (సి) ఫిన్ (బి) బ్రాడ్ 5; పటేల్ (సి) బెల్ (బి) ఫిన్ 1; మోహిత్ (నాటౌట్) 7; షమీ (సి) బట్లర్ (బి) వోక్స్ 25; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (48.1 ఓవర్లలో ఆలౌట్) 200 వికెట్ల పతనం: 1-83; 2-103; 3-107; 4-134; 5-136; 6-152; 7-164; 8-164; 9-165; 10-200; బౌలింగ్: అండర్సన్ 9-1-24-1; వోక్స్ 9.1-1-47-2; బ్రాడ్ 10-1-56-2; ఫిన్ 10-0-36-3; అలీ 10-0-35-2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెల్ (ఎల్బీ) (బి) మోహిత్ 10; అలీ (సి) రాయుడు (బి) పటేల్ 17; టేలర్ (సి) బిన్నీ (బి) మోహిత్ 82; రూట్ (సి అండ్ బి) బిన్నీ 3; మోర్గాన్ (సి) ధావన్ (బి) బిన్నీ 2; బొపారా (సి) జడేజా (బి) బిన్నీ 4; బట్లర్ (సి) రాయుడు (బి) షమీ 67; వోక్స్ (నాటౌట్) 4; బ్రాడ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (46.5 ఓవర్లలో 7 వికెట్లకు) 201 వికెట్ల పతనం: 1-14; 2-40; 3-44; 4-54; 5-66; 6-191; 7-193; బౌలింగ్: బిన్నీ 8-0-33-3; మోహిత్ 10-1-36-2; షమీ 9-0-31-1; అక్షర్ పటేల్ 10-1-39-1; రవీంద్ర జడేజా 9.5-0-62-0. -
నిలవాలంటే గెలవాలి !
భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటి వరకు నాలుగు టెస్టులు, రెండు వన్డే మ్యాచ్‌లు ఆడింది. కానీ ఒక్క విజయం కూడా రుచి చూడ లేదు. ముందున్నది ప్రపంచకప్ కాలం. అందుకు సన్నాహకంగా సాగుతున్న టోర్నీలో కొత్త లోపాలు బయట పడ్డాయి. ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లే. కాంబి నేషన్లు, బ్యాటింగ్ ఆర్డర్లు అన్నీ ఇక్కడే తేలిపోవాలి. వాటితో పాటు ముక్కోణపు టోర్నీలో ఇప్పుడు జట్టుకు ఒక్క విజయం కూడా కావాలి. సిడ్నీ: భారత రిపబ్లిక్ డే, ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం రోజున ఇరు జట్లు క్రికెట్ మైదానంలో బరిలోకి దిగుతున్నాయి. ముక్కోణపు వన్డే టోర్నీలో భాగంగా సోమవారం జరిగే ఐదో లీగ్ మ్యాచ్‌లో భారత్, ఆసీస్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్ చేరుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఆసీస్‌తో గెలిస్తే ఇంగ్లండ్‌పై సాధారణ విజయం చాలు. ఇక్కడ ఓడినా స్వల్ప అవకాశాలు ఉంటాయి. అయితే చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారీ తేడాతో ఓడించడం, రన్‌రేట్ కాపాడుకోవడంవంటి చాలా అంశాలు ముడిపడి ఉం టాయి. కాబట్టి నేటి మ్యాచ్‌లో విజయం కోసం ధోని సేన సర్వ శక్తులు ఒడ్డాల్సి ఉంది. బరిలోకి ఇషాంత్ ఆసీస్‌పై తొలి మ్యాచ్‌లో పోరాట పటిమ కనబర్చిన భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో మాత్రం ఘోరంగా ఓటమిపాలైంది. అప్పటి వరకు బౌలింగే సమస్య అనుకుంటే, గత మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ మరీ బలహీనంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాలి. రోహిత్ శర్మ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో వరుసగా విఫలమవుతున్నా... ధావన్‌కు తుది జట్టులో చోటు ఖాయం. భారత బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కోహ్లి ఏ స్థానంలో ఆడతాడనేది మాత్రం ఆసక్తికరం. రవీంద్ర జడేజా కొంత వరకు కోలుకున్నా, అతని మ్యాచ్ ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నాయి. కాబట్టి వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయినా అక్షర్ పటేల్‌కు మరో అవకాశం దక్కవచ్చు. గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన ఇషాంత్ శర్మ ఈ మ్యాచ్ బరిలోకి దిగడం ఖాయమైంది. పేసర్లు ఉమేశ్, షమీలలో ఒకరిని తప్పించి అతనికి అవకాశం కల్పిస్తారు. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో రెండో స్పిన్నర్‌గా అశ్విన్‌ను ఎంపిక చేసి... గత మ్యాచ్‌లో జట్టులో మెరుగైన ప్రదర్శన కనబర్చిన స్టువర్ట్ బిన్నీని పక్కన పెడతారా చూడాలి. కెప్టెన్‌గా బెయిలీ మరోవైపు ఇప్పటికే ఫైనల్ చేరిన ఆస్ట్రేలియాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. అయినా సరే ఈ మ్యాచ్‌లో ఉదాసీనత ప్రదర్శించవద్దని జట్టు భావిస్తోంది. ఆ జట్టు కూడా ప్రపంచ కప్‌కు ముందు వేర్వేరు కాంబినేషన్లను ప్రయత్నిస్తోంది. జార్జ్ బెయిలీ మరోసారి కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. అయితే సుదీర్ఘ కాలంగా బ్యాటింగ్‌లో విఫలమవుతున్న అతను ఈ మ్యాచ్‌లోనైనా రాణించాల్సి ఉంది. వైట్ స్థానంలో అతను జట్టులోకి వస్తుండగా, షాన్ మార్ష్ స్థానంలో డేవిడ్ వార్నర్ బరిలోకి దిగుతున్నాడు. వైట్, మార్ష్ ప్రపంచ కప్ జట్టులో లేరు. బౌలింగ్ విభాగంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ డోహర్తి రావడం ఖాయమైంది. అదే విధంగా రొటేషన్ పాలసీ ప్రకారం హాజల్‌వుడ్, మిషెల్ మార్ష్‌లకు కూడా అవకాశం దక్కవచ్చు. స్టీవెన్ స్మిత్ అద్భుత ఫామ్‌లో ఉండటంతో పాటు వార్నర్, ఫించ్ కూడా రాణిస్తుండటం ఆసీస్ బలంగా చెప్పవచ్చు. మ్యాక్స్‌వెల్ కూడా ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడితే ఆసీస్‌కు తిరుగుండదు. ఆ జట్టు రెండో స్పిన్నర్ కోటాను అతను పూర్తి చేయగలడు. జట్ల వివరాలు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రహానే, రాయుడు, కోహ్లి, రైనా, అక్షర్, భువనేశ్వర్, ఇషాంత్ శర్మ, బిన్నీ/అశ్విన్, ఉమేశ్/షమీ. ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), ఫించ్, వార్నర్, స్మిత్, మ్యాక్స్‌వెల్, హాడిన్, ఫాల్క్‌నర్, స్టార్క్, హాజల్‌వుడ్, డోహర్తి, మిషెల్ మార్ష్/సంధు. ఉ. గం.8.50 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం పరిస్థితులకు తగిన విధంగా ఉపయోగించుకోగల ఆట గాళ్లు జట్టులో ఉండటమే మాకు పెద్ద బలం. అది గతంలోనూ చూశాము. ఇకపై కూడా అలా చేయగలం. అవసరమున్న సమయంలో డోహర్తిని ఆడించగలగడం, పేస్ బౌలర్లను ఉపయోగిం చుకోగలగడం కూడా ఇందులో భాగమే. కాబట్టి 15 మంది సభ్యులకూ తగిన పాత్ర ఉంటుంది. -బెయిలీ, ఆసీస్ కెప్టెన్ ప్రయోగం అనే పదాన్ని మేం నిషేధించాం. మేం అలాంటివి ఏమీ చేయడం లేదు. మా అత్యుత్తమ 11 మంది ఆటగాళ్లనే బరిలోకి దించుతున్నాం. దీనికి ఎవరు ఎలాంటి పేరు పెట్టుకున్నా అభ్యంతరం లేదు. గాయాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే. ప్రపంచ కప్‌లో రోహిత్ ఫిట్‌నెస్‌పై గురించి అప్పుడే ఆందోళన అనవసరం. -ధోని, భారత కెప్టెన్ పిచ్, వాతావరణం వికెట్ పొడిగా ఉంది. స్పిన్‌కు అనుకూలం. రెండో ఇన్నింగ్స్‌లో ఇది మరింత సహకరించే అవకాశం ఉంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య 13 మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 12 మ్యాచ్‌ల్లో నెగ్గగా... భారత్ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. -
ఆసీస్‌కు ‘బోనస్’ పాయింట్
సిడ్నీ: ముక్కోణపు వన్డే టోర్నీని ఆస్ట్రేలియా బోనస్ పాయింట్ విజయంతో ఘనంగా ప్రారంభించింది. శుక్రవారం సిడ్నీ క్రికెట్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటయింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (136 బంతుల్లో 121; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో అద్భుతమైన సెంచరీ చేశాడు. 69 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లు కోల్పోయినా... బట్లర్ (28), జోర్డాన్ (17)ల అండతో మోర్గాన్ గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్‌కు నాలుగు, ఫాల్క్‌నర్‌కు మూడు వికెట్లు దక్కాయి. తర్వాత ఆస్ట్రేలియా జట్టు 39.5 ఓవర్లలో ఏడు వికెట్లకు 235 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ వార్నర్ (115 బం తుల్లో 127; 18 ఫోర్లు) మూడేళ్ల తర్వాత వన్డేల్లో సెం చరీ చేశాడు. స్టీవ్ స్మిత్ (37) రాణించాడు. మిగిలిన ప్రధాన బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆకట్టుకోకపోయినా... వార్నర్ మెరుపులతో ఆసీస్ వేగంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లండ్ బౌలర్ వోక్స్ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మూడు బంతుల్లో రెండు వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ స్టార్క్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 40 ఓవర్లలోపు గెలిస్తే జట్టుకు బోనస్ పాయింట్ దక్కుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ ద్వారా ఆసీస్‌కు 5 పాయింట్లు లభించాయి.