నిలవాలంటే గెలవాలి ! | Winless India need to avoid defeat | Sakshi
Sakshi News home page

నిలవాలంటే గెలవాలి !

Published Mon, Jan 26 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

నిలవాలంటే గెలవాలి !

నిలవాలంటే గెలవాలి !

భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటి వరకు నాలుగు టెస్టులు, రెండు వన్డే మ్యాచ్‌లు ఆడింది. కానీ ఒక్క విజయం కూడా రుచి చూడ లేదు. ముందున్నది ప్రపంచకప్ కాలం. అందుకు సన్నాహకంగా సాగుతున్న టోర్నీలో కొత్త లోపాలు బయట పడ్డాయి. ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లే. కాంబి నేషన్‌లు, బ్యాటింగ్ ఆర్డర్‌లు అన్నీ ఇక్కడే తేలిపోవాలి. వాటితో పాటు ముక్కోణపు టోర్నీలో ఇప్పుడు జట్టుకు ఒక్క విజయం కూడా కావాలి.
 
 సిడ్నీ: భారత రిపబ్లిక్ డే, ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం రోజున ఇరు జట్లు క్రికెట్ మైదానంలో బరిలోకి దిగుతున్నాయి. ముక్కోణపు వన్డే టోర్నీలో భాగంగా సోమవారం జరిగే ఐదో లీగ్ మ్యాచ్‌లో భారత్, ఆసీస్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్ చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ ఫైనల్ అవకాశాలు  సజీవంగా ఉంటాయి. ఆసీస్‌తో గెలిస్తే ఇంగ్లండ్‌పై సాధారణ విజయం చాలు. ఇక్కడ ఓడినా స్వల్ప అవకాశాలు ఉంటాయి. అయితే చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారీ తేడాతో ఓడించడం, రన్‌రేట్ కాపాడుకోవడంవంటి చాలా అంశాలు ముడిపడి ఉం టాయి. కాబట్టి నేటి మ్యాచ్‌లో విజయం కోసం ధోని సేన సర్వ శక్తులు ఒడ్డాల్సి ఉంది.
 
బరిలోకి ఇషాంత్
ఆసీస్‌పై తొలి మ్యాచ్‌లో పోరాట పటిమ కనబర్చిన భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో మాత్రం ఘోరంగా ఓటమిపాలైంది. అప్పటి వరకు బౌలింగే సమస్య అనుకుంటే, గత మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ మరీ బలహీనంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాలి. రోహిత్ శర్మ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో వరుసగా విఫలమవుతున్నా... ధావన్‌కు తుది జట్టులో చోటు ఖాయం. భారత బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కోహ్లి ఏ స్థానంలో ఆడతాడనేది మాత్రం ఆసక్తికరం. రవీంద్ర జడేజా కొంత వరకు కోలుకున్నా, అతని మ్యాచ్ ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నాయి.

కాబట్టి వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయినా అక్షర్ పటేల్‌కు మరో అవకాశం దక్కవచ్చు. గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన ఇషాంత్ శర్మ ఈ మ్యాచ్ బరిలోకి దిగడం ఖాయమైంది. పేసర్లు ఉమేశ్, షమీలలో ఒకరిని తప్పించి అతనికి అవకాశం కల్పిస్తారు. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో రెండో స్పిన్నర్‌గా అశ్విన్‌ను ఎంపిక చేసి... గత మ్యాచ్‌లో జట్టులో మెరుగైన ప్రదర్శన కనబర్చిన స్టువర్ట్ బిన్నీని పక్కన పెడతారా చూడాలి.
 
కెప్టెన్‌గా బెయిలీ
మరోవైపు ఇప్పటికే ఫైనల్ చేరిన ఆస్ట్రేలియాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. అయినా సరే ఈ మ్యాచ్‌లో ఉదాసీనత ప్రదర్శించవద్దని జట్టు భావిస్తోంది. ఆ జట్టు కూడా ప్రపంచ కప్‌కు ముందు వేర్వేరు కాంబినేషన్లను ప్రయత్నిస్తోంది. జార్జ్ బెయిలీ మరోసారి కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. అయితే సుదీర్ఘ కాలంగా బ్యాటింగ్‌లో విఫలమవుతున్న అతను ఈ మ్యాచ్‌లోనైనా రాణించాల్సి ఉంది.

వైట్ స్థానంలో అతను జట్టులోకి వస్తుండగా, షాన్ మార్ష్ స్థానంలో డేవిడ్ వార్నర్ బరిలోకి దిగుతున్నాడు. వైట్, మార్ష్ ప్రపంచ కప్ జట్టులో లేరు. బౌలింగ్ విభాగంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ డోహర్తి రావడం ఖాయమైంది. అదే విధంగా రొటేషన్ పాలసీ ప్రకారం హాజల్‌వుడ్, మిషెల్ మార్ష్‌లకు కూడా అవకాశం దక్కవచ్చు. స్టీవెన్ స్మిత్ అద్భుత ఫామ్‌లో ఉండటంతో పాటు వార్నర్, ఫించ్ కూడా రాణిస్తుండటం ఆసీస్ బలంగా చెప్పవచ్చు. మ్యాక్స్‌వెల్ కూడా ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడితే ఆసీస్‌కు తిరుగుండదు. ఆ జట్టు రెండో స్పిన్నర్ కోటాను అతను పూర్తి చేయగలడు.

 జట్ల వివరాలు (అంచనా)
 భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రహానే, రాయుడు, కోహ్లి, రైనా, అక్షర్, భువనేశ్వర్, ఇషాంత్ శర్మ, బిన్నీ/అశ్విన్, ఉమేశ్/షమీ.

 ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), ఫించ్, వార్నర్, స్మిత్, మ్యాక్స్‌వెల్, హాడిన్,  ఫాల్క్‌నర్, స్టార్క్, హాజల్‌వుడ్, డోహర్తి, మిషెల్ మార్ష్/సంధు.
 ఉ. గం.8.50 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 
  పరిస్థితులకు తగిన విధంగా ఉపయోగించుకోగల ఆట గాళ్లు  జట్టులో ఉండటమే మాకు పెద్ద బలం. అది గతంలోనూ చూశాము. ఇకపై కూడా అలా చేయగలం. అవసరమున్న సమయంలో డోహర్తిని ఆడించగలగడం, పేస్ బౌలర్లను ఉపయోగిం చుకోగలగడం కూడా ఇందులో భాగమే. కాబట్టి 15 మంది సభ్యులకూ తగిన పాత్ర ఉంటుంది.       
  -బెయిలీ, ఆసీస్ కెప్టెన్
 
 ప్రయోగం అనే పదాన్ని మేం నిషేధించాం. మేం అలాంటివి ఏమీ చేయడం లేదు. మా అత్యుత్తమ 11 మంది ఆటగాళ్లనే బరిలోకి దించుతున్నాం. దీనికి ఎవరు ఎలాంటి పేరు పెట్టుకున్నా అభ్యంతరం లేదు. గాయాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే. ప్రపంచ కప్‌లో రోహిత్ ఫిట్‌నెస్‌పై గురించి అప్పుడే ఆందోళన అనవసరం.    
  -ధోని, భారత కెప్టెన్
 
 పిచ్, వాతావరణం
 వికెట్ పొడిగా ఉంది. స్పిన్‌కు అనుకూలం. రెండో ఇన్నింగ్స్‌లో ఇది మరింత సహకరించే అవకాశం ఉంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.
 
 సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య 13 మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 12 మ్యాచ్‌ల్లో నెగ్గగా... భారత్ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement