నీకంత సీన్ లేదు..!
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఆటగాడు షబ్బిర్ రెహ్మాన్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భాగంగా బంగ్లాదేశ్ ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో షబ్బిర్ అర్థ శతకంతో జట్టును ఆదుకున్నాడు. అయితే షబ్బిర్ బ్యాటింగ్ పై ఆసీస్ స్పిన్నర్ నాధన్ లయన్ ప్రశంసలు కురింపించాడు. షబ్బిర్ బ్యాటింగ్ ను చూస్తుంటే తనకు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి బ్యాటింగ్ గుర్తుకొ్చ్చిందంటూ లయన్ కొనియాడాడు.
గతంలో భారత్ లో ఆసీస్ పర్యటన సందర్భంగా విరాట్ నుంచి ఎదురైన ప్రతిఘటన షబ్బిర్ లో కనబడిందన్నాడు. ఇదిలా ఉంచితే, లయన్ కామెంట్ పై షబ్బిర్ తనదైన శైలిలో స్పందించాడు. 'నేను విరాట్ కోహ్లి స్థాయి ఆటగాడ్ని కాగలను. తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. కాకపోతే అతనితో నేను పోల్చుకోదలుచుకోలేదు. జట్టుకు అవసరమైన పరుగుల్ని సాధించడమే నాకు ముఖ్యం' అని షబ్బిర్ వ్యాఖ్యానించాడు. దీనిపై విమర్శలు వర్షం కురుస్తోంది. షబ్బిర్.. నీ కంత సీన్ లేదంటూ ట్విట్టర్ లో నెటిజన్లు మండిపడుతున్నారు. నువ్వు విరాట్ కోహ్లి స్థాయి ఆటగాడివైతే ఇక మనం భూమిని విడిచే సమయం ఆసన్నమైనట్లే అంటూ ఛలోక్తులు విసురుకుంటున్నారు. ఇది చాలా మంచి జోక్ అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, ఇక ఈ భూగ్రహం ఎంతమాత్రం మనం నివసించడానికి సేఫ్ గా లేనట్టేనని మరొకరు విమర్శించారు.