
తెలంగాణకు రెండు, ఏపీకి రెండు స్వర్ణాలు
జాతీయ క్రీడలు
తిరువనంతపురం: జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు పసిడి కాంతులు పూయించారు. గేమ్స్ ఐదో రోజు గురువారం ఏపీ, తెలంగాణ క్రీడాకారులు రెండేసి స్వర్ణాలు సాధించారు. రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్ 500 మీటర్ల ఫైనల్లో అస్రార్ పాటిల్ (తెలంగాణ) 1ని.38 సెకన్లలో లక్ష్యాన్ని చేరి తొలి స్థానంలో నిలిచాడు. పురుషుల 500 మీటర్ల కాక్స్‌లెస్ పెయిర్ కేటగిరీలో దేవీందర్ సింగ్, మన్‌జీత్ సింగ్ ద్వయం 1ని.32 సెకన్ల టైమింగ్‌తో పసిడిని సొంతం చేసుకుంది. పురుషుల బీచ్‌వాలీబాల్ ఫైనల్లో తెలంగాణకు చెందిన రవీందర్ రెడ్డి-చైతన్య జోడి రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం తెలంగాణ ఖాతాలో రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఓ కాంస్యం ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ జిమ్నాస్ట్ మేఘన గుండాల్‌పలి వ్యక్తిగత ‘రిథమిక్ ఆల్‌రౌండ్ క్లబ్’ ఫైనల్లో స్వర్ణం గెలుచుకుంది. పురుషుల బీచ్‌వాలీబాల్‌లో సీహెచ్ రామకృష్ణంరాజు-నరేష్ జోడి పసిడిని కైవసం చేసుకుంది. ఫైనల్లో ఏపీ జంట 18-21, 21-17, 15-10తో తెలంగాణ టీమ్‌పై నెగ్గింది. మహిళల విభాగం ఫైనల్లో ఏపీ జోడి తిరుమహాలక్ష్మీ రాజన్-మహేశ్వరి రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. టేబుల్ వాల్ట్ జిమ్నాస్టిక్ విభాగంలో అరుణ బుడ్డా కాంస్యం దక్కించుకుంది. ఓవరాల్‌గా ఏపీ మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఐదు కాంస్యాలతో కొనసాగుతోంది.
జీతూరాయ్‌కు రెండు స్వర్ణాలు
ఆసియా గేమ్స్ చాంపియన్ జీతూ రాయ్ షూటింగ్ గురి అదిరింది. 10 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో, వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణాలు గెలిచాడు. వెయిట్ లిఫ్టింగ్‌లో 105 కేజీల విభాగంలో హిమాన్షు కుమార్ (ఉత్తరప్రదేశ్) మీట్ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా 358 (153+205) కేజీల బరువు ఎత్తి స్వర్ణం చేజిక్కించుకున్నాడు.