
ఇద్దరు ఆటగాళ్లను సంప్రదించారు
ఐపీఎల్-7లో బుకీలపై సునీల్ గవాస్కర్
కోల్‌కతా: గతేడాది ఐపీఎల్‌ను కుదిపేసిన బుకీలు ఈసారి కూడా పంజా విసిరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా ఇద్దరు ఆటగాళ్లను బుకీలు సంప్రదించినట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ తెలిపారు. ఈ విషయాన్ని అవినీతి వ్యతిరేక మరియు భద్రతా యూనిట్ (ఏసీఎస్‌యూ) అధికారులకు తెలిపినట్టు చెప్పారు. మెకల్లమ్ వ్యవహారంలో మీడియాకు లీక్ ఐపీఎల్ నుంచి వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. ‘మెకల్లమ్ ఐసీసీకి ఇచ్చిన వాంగ్మూలం మీడియా చేతికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఐపీఎల్ ద్వారా మాత్రం వెళ్లలేదు. ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశమే.
ఈసారి ప్రతీ జట్టుకు ఇంటెగ్రిటీ అధికారి (ఐఓ)ని నియమించాం. దీంతో ఆటగాళ్లు తమకు తెలిసిన విషయాలను సులువుగా చెప్పగలుగుతున్నారు. ఒక్కోసారి బుకీలు ఆటగాళ్లను సంప్రదించినప్పుడు వారికేం చేయాలో అర్థం కాదు. వారి దగ్గర ఏసీఎస్‌యూ నంబర్ ఉంటుంది కానీ ఒకసారి వారితో కాంటాక్ట్ అయితే ఇక ఎప్పటికీ నిఘాలో ఉండిపోతామేమోననే భయం ఉంటుంది. అదే ఐఓకు విషయం చెబితే ఆయనే ముందుకు తీసుకెళతాడు’ అని గవాస్కర్ పేర్కొన్నారు.