గచ్చిబౌలి: ఓ తాపీ మేస్త్రీ కొడుకు అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదిగాడు. అంతేకాదు.. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నో పతకాలను సైతం సాధించొక్చాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా వెనుదిరగక దాతల సాయంతో ముందుకెళుతున్నాడు సుగునూరు ఉదయ్ సాగర్. కిక్ బాక్సింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఈవెంట్‌లోనూ ఉదయ్ సాగర్ పతకం సాధించడం విశేషం. పదో తరగతిలో ఉండగా కిక్ బాక్సింగ్‌పై మక్కువ పెంచుకున్న ఇతడు ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళుతున్నాడు. ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు టర్కీలోని అంటాలియాలో జరిగిన 4వ ఇంటర్నేషనల్ యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పాల్గొన్న ఒకే ఒక్క క్రీడాకారుడు ఉదయ్ కావడం గమనార్హం. అంతేకాదు.. ఈ పోటీల్లో పాల్గొన్న 22 దేశాలను తలదన్ని సూపర్ హెవీ వెయిట్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఇది కాకుండా జాతీయ స్థాయిలో ఏడు బంగారు పతకాలు, రెండు రజత పతకాలు సాధించి కిక్ బాక్సింగ్‌లో తనకు ఎదరులేదని నిరూపిస్తున్నాడు.
కుటుంబ నేపథ్యం ఇదీ
వనపర్తి జిల్లా కేంద్రంలోని టీచర్స్‌కాలనీకి చెందిన ఉదయ్ సాగర్ తండ్రి సుగునరు రాము తాపీమేస్త్రి, తల్లి అరుణ గృహిణి. తండ్రి సంపాదనతోనే కుటుంబ పోషణ అధారపడి ఉంది. ఇంటర్ చదువుతుండగా వనపర్తిలోని కరాటే శేఖర్ వద్ద కిక్ బాక్సింగ్ శిక్షణ పొందాడు. ప్రస్తుతం ఉదయ్ తల్లిదండ్రులతో కలిసి మియాపూర్‌లోని ప్రగతి ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నాడు.
కిక్ నుంచి బాక్సింగ్ వైపు..
ఇప్పటి వరకు కిక్ బాక్సింగ్‌కు ఒలింపిక్‌లో అవకాశం కల్పించలేదు. వచ్చే 2024లో జరిగే క్రీడల్లోనూ కిక్ బాక్సింగ్‌కు చోటు దక్కుతుందనేది అనుమానమే. దీంతో ఉదయ్ కొంత కాలంగా బాక్సింగ్‌లోనూ శిక్షణ తీసుకుంటున్నాడు. ఎయిర్‌ఫోర్స్ రిటైర్డ్ ఆఫీసర్ చిరంజీవి వద్ద బాక్సింగ్‌లో శిక్షణ, మెళకువలు నేర్చుకుంటున్నాడు.
ఒలింపిక్స్ పతకమే లక్ష్యం
ఒలింపిక్స్‌లో కిక్ బాక్సింగ్‌కు చోటు కల్పిస్తే పతకం సాధించడమే నా లక్ష్యం. బాక్సింగ్‌లో ఒలింపిక్ మెడల్ సాధించిన విజేందర్ సింగ్ నాకు స్పూర్తి. రోజు నాలుగు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తాను. ఒక్కో ఈవెంట్‌కు వెళ్లాలంటే కనీసం రూ.30 వేలు ఖర్చవుతుంది. శిరీష ఎస్టేట్స్ నిర్వాహకులు రఘునాథ్ యాదవ్ ఆర్థిక సాయం అందిస్తున్నారు. – ఉదయ్ సాగర్
సాధించిన పతకాలు ఇవే..
♦ తొలిసారి 2013లో యాకూత్‌పురాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకంసాధించాడు.
♦ 2015లో నగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం
♦ వైజాగ్‌లో జరిగిన జాతీయ పోటీల్లో89 కిలోల విభాగంలో కాంస్య పతకం
♦ 2015 ఆగస్టులో కోల్‌కతాలో జరిగిన జాతీయ పోటీల్లో 90 కిలోల విభాగంలో రజత పతకం
♦ 2017 జనవరిలో ఢిల్లీలో జరిగిన నేషనల్‌ఫెడరేషన్ కప్‌లో బంగారు పతకం
♦ ఏప్రిల్‌లో మహారాష్ట్ర, సెప్టెంబర్‌లోచత్తీస్‌ఘడ్‌లో జరిగిన జాతీయ పోటీల్లో బంగారు పతకాలు
♦ 2018 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన జాతీయ పోటీల్లో బంగారు పతకం. ఆగస్టులో సీనియర్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బగారు పతకం.
Comments
Please login to add a commentAdd a comment