![ఆర్పీఎస్‌జీ మావెరిక్స్ జట్టులో శరత్ కమల్](/styles/webp/s3/article_images/2017/09/5/51497037320_625x300.jpg.webp?itok=yMWwURFH)
ఆర్పీఎస్‌జీ మావెరిక్స్ జట్టులో శరత్ కమల్
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్
ముంబై: ఐపీఎల్ తరహాలో టేబుల్ టెన్నిస్‌లో కూడా ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌కు రంగం సిద్ధమైంది. అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్ పేరుతో జరిగే ఈ టోర్నీకి సంబంధించి ఆటగాళ్ల ఎంపిక కార్యక్రమం శుక్రవారం జరిగింది. భారత నెం. 1 టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్‌ను సంజీవ్ గోయెంకా ప్రాంచైజీ ‘ఆర్పీఎస్‌జీ మావెరిక్స్’ జట్టు సొంతం చేసుకుంది. మొత్తం 48 మంది ప్యాడ్లర్లు (ఇందులో 24 మంది విదేశీయులు) ఆరు జట్ల తరఫున ఎంపికయ్యారు. తొలి సీజన్‌లో బేసైడ్ స్పిన్నర్స్, చాలెంజర్స్, దబంగ్ స్మాషర్స్, మహారాష్ట్ర యునైటెడ్, ఆయిల్‌మ్యాక్స్ స్టాగ్ యోధాస్, ఆర్పీఎస్‌జీ మావెరిక్స్ జట్లు పాల్గొంటున్నాయి.
జూలై 13నుంచి 30వరకు యూటీటీ లీగ్ జరుగుతుంది. భారత మహిళా నెం.1 క్రీడాకారిణి మధురికా పాట్కర్ ‘దబంగ్ స్మాషర్స్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుండగా, భారత యువ ఒలింపియన్ సౌమ్యజిత్ ఘోష్‌ను ‘చాలెంజర్స్’ జట్టు దక్కించుకుంది. హర్మీత్ దేశాయ్ ‘మహారాష్ట్ర యునైటెడ్’ జట్టు తరఫున ఆడనున్నాడు. ఈ లీగ్‌లో ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లు వాంగ్ చున్ టింగ్ (ప్రపంచ నెం. 7, హాంకాంగ్) మహారాష్ట్ర యునైటెడ్ జట్టు తరఫున, మా ర్కోస్ ఫ్రేతస్ (ప్రపంచనెం. 16, పోర్చుగల్) దబంగ్ స్మాషర్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతారు. మహిళల విభాగంలో ప్రపంచ నెం. 9 ప్లేయర్ హాన్ యింగ్ (జర్మనీ) చాలెంజర్స్ తరఫున ఆడుతుంది. ఈ లీగ్‌లో ఆటగాళ్లకు అత్యధికంగా 20 లక్షలు, అత్యల్పంగా 2.5 లక్షలు చెల్లించినట్లు లీగ్ చైర్‌పర్సన్ విటా డాని తెలిపారు.