
ఇద్దరూ ఒకేవైపు... నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉమేశ్ ఉండగా బుమ్రా బౌలింగ్ చేస్తున్న దృశ్యం
ముంబై: ముంబై ఇండియన్స్–రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఘటన అంపైరింగ్ ప్రమాణాలను వేలెత్తి చూపింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా వేసిన 18వ ఓవర్ చివరి బంతికి బెంగళూరు బ్యాట్స్‌మన్ ఉమేశ్ యాదవ్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. కానీ, ‘ఓవర్ స్టెప్పింగ్ నోబాల్స్’ వేసే అలవాటున్న బుమ్రాపై అనుమానంతోనే ఏమో ఫీల్డ్ అంపైర్లు మూడో అంపైర్ అనంత పద్మనాభన్‌ను సంప్రదించారు. ఈ సందర్భంగా రీప్లేలు పరిశీలించిన అతడు ఔట్ ప్రకటించడంతో ఉమేశ్ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. అప్పటికీ ఫీల్డ్ అంపైర్లు దీనిని ఆశ్చర్యకరంగానే చూశారు. అయితే, ఓ అభిమాని పరిశీలనలో ఆసక్తి కర సంగతులు బయటపడ్డాయి. అవేంటంటే... మూడో అంపైర్ పరిశీలించిన రీప్లే, ఉమేశ్ ఔటైన రీప్లే ఒకటి కాదు.
అతడు చూసిన దాంట్లో ఉమేశ్ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోనే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇంకోటి ఉమేశ్ క్యాచ్ అవుటైన బంతిని బుమ్రా నో బాల్‌గా వేశాడు. అంటే అతడు నాటౌట్. దీనిపై ఆ అభిమాని వీడియో క్లిప్పింగ్‌లను క్రిక్‌ఇన్ఫోకు పోస్ట్ చేశాడు. అయితే... ఇలాంటివి గతంలోనూ రెండుసార్లు వెలుగులోకి వచ్చాయి. 2011 ఐపీఎల్‌లో అమిత్ మిశ్రా బౌలింగ్‌లో సచిన్‌ను, అదే ఏడాది బార్బడోస్ టెస్టు సందర్భంగా ఫిడేల్ ఎడ్వర్డ్స్ బౌలింగ్‌లో ధోనిని అచ్చం ఇలాగే ఔట్‌గా ప్రకటించారు. రీప్లే ఆపరేటర్ రెండుసార్లు క్లిక్ చేయడం వలన అసలు దాని బదులు అంతకుముందటి రీప్లే వీడియో థర్డ్ అంపైర్ ముందుకొస్తుంది. దాని ఆధారంగానే నిర్ణయం తీసుకుంటుండటంతో తప్పులు దొర్లుతున్నాయి.
కొసమెరుపు... నో బాల్స్ విషయంలో బుమ్రాను పదేపదే విమర్శించే సునీల్ గావస్కర్ ఈ మ్యాచ్‌కు వ్యాఖ్యాత. ఆయన సైతం థర్డ్ అంపైర్ చూసిన రీప్లేనే చూసి పొరపడి, ఉమేశ్ ఔటైనట్లు నిర్ధారణకు వచ్చారు.