కివీస్ జాతీయ జట్టులో కొత్త ముఖం
వెల్టింగ్టన్: త్వరలో శ్రీలంకతో జరిగే ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మూడు వన్డేలకు న్యూజిలాండ్ జాతీయ జట్టులో తొలిసారి హెన్రీ నికోలస్(24)కు స్థానం దక్కించుకున్నాడు. గత ఏడాది దేశవాళీ లీగ్ ల్లో నికోలస్ ఆకట్టుకోవడంతో అతని స్థానం కల్పిస్తూ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దేశవాళీ లీగ్ ల్లో కాంట్ బెర్రీకి ప్రాతినిథ్యం వహిస్తున్న హెన్రీ ... 2014లో 75.66 వన్డే సగటును నమోదు చేశాడు. దీంతో పాటు అదే ఏడాది న్యూజిలాండ్ వ్యాప్తంగా జరిగిన దేశవాళీ మ్యాచ్ ల్లో హెన్రీ అత్యధిక వన్డే పరుగులను సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. కివీస్ జట్టులో యువ రక్తాన్నిఎక్కించే ప్రయత్నంలో భాగంగానే హెన్రీని ఎంపిక చేసినట్లు ఆ జట్టు చీఫ్ కోచ్ మైక్ హెస్సెన్ తెలిపాడు.
ఇదిలా ఉండగా, న్యూజిలాండ్ తొలి మూడు వన్డేలకు ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కు విశ్రాంతి కల్పించగా, మొదటి రెండు వన్డేలకు మరో బౌలర్ టిమ్ సౌతీ అందుబాటులో ఉండటం లేదు. మూడో వన్డే నాటికి సౌతీ జట్టుతో కలుస్తాడని హెస్సన్ స్పష్టం చేశాడు. డిసెంబర్ 26వ తేదీ నుంచి శ్రీలంక-న్యూజిలాండ్ ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.