
అజేయ భారత్‌దే టైటిల్
* అండర్-19 ముక్కోణపు టోర్నీ
* ఫైనల్లో శ్రీలంక చిత్తు
కొలంబో: అండర్-19 ముక్కోణపు వన్డే టోర్నీని భారత జట్టు సొంతం చేసుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 47.2 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. పీవీఆర్ డిసిల్వా (75 బంతుల్లో 58; 7 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా... మయాంక్, అవేశ్ ఖాన్, శుభమ్ తలా 2 వికెట్లు తీశారు.
అనంతరం భారత్ 33.5 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (77 బంతుల్లో 56; 6 ఫోర్లు) టోర్నీలో మూడో సెంచరీ సాధించగా, రిషభ్ పంత్ (35), రికీ భుయ్ (29 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో దమిత సిల్వ (3/18) ఆకట్టుకున్నాడు. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లు కూడా గెలిచిన యువ జట్టు టోర్నీలో అజేయంగా నిలవడం విశేషం.