ఇషాంత్ ‘ఎక్స్‌ట్రా’ ప్రాక్టీస్
ఇషాంత్ ‘ఎక్స్‌ట్రా’ ప్రాక్టీస్
Published Tue, Oct 22 2013 12:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
రాంచీ: మూడో వన్డేలో ఘోరంగా విఫలమైన భారత పేసర్ ఇషాంత్ శర్మ... తన బౌలింగ్‌పై మరింత దృష్టి పెట్టాడు. సోమవారం జరిగిన అప్షనల్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ కోచ్ జో డావెస్‌తో కలిసి రెండు గంటల పాటు సుదీర్ఘంగా కసరత్తులు చేశాడు. సహచరులు విశ్రాంతికే పరిమితమైనా... లంబూ మాత్రం నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చాడు. జేఎస్‌సీఏ స్టేడియంలో మధ్యాహ్నం ప్రాక్టీస్‌కు వచ్చిన ఇషాంత్ లైన్ అండ్ లెంగ్త్‌పై కోచ్ ఎక్కువగా దృష్టిపెట్టాడు. మరో పేసర్ జైదేవ్ ఉనాద్కట్ కూడా ఇషాంత్‌తో పాటు ప్రాక్టీస్‌కు వచ్చాడు. ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న ఆసీస్ జట్టు కూడా ఉదయం ప్రాక్టీస్‌లో పాల్గొంది.
మరోవైపు రేపు (బుధవారం) జరగనున్న నాలుగో వన్డేకు వరుణుడి ముప్పు పొంచి ఉంది. సోమవారం సాయంత్రం గంటకు పైగా భారీ వర్షం కురవడంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. అయితే రాంచీ అభిమానులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. కొత్తగా నిర్మించిన జేఎస్‌సీఏ స్టేడియం సామర్థ్యం 40 వేలు కాగా ఇప్పటికే దాదాపుగా టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఈ స్టేడియంలో ఇది రెండో వన్డే మ్యాచ్. జనవరి 19న ఇంగ్లండ్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Advertisement