రోహిత్‌ స్థానంలో అయ్యర్‌! | Reports Rohit Sharma And Ishant Sharma May Miss Australia Test series | Sakshi
Sakshi News home page

రోహిత్‌ స్థానంలో అయ్యర్‌!

Published Tue, Nov 24 2020 10:37 AM | Last Updated on Tue, Nov 24 2020 11:17 AM

Reports Rohit Sharma And Ishant Sharma May Miss Australia Test series - Sakshi

న్యూఢిల్లీ: గాయాలతో సతమతమవుతున్న టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ, బౌలర్‌ ఇషాంత్‌ శర్మ ఆస్ట్రేలియాకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం వీరిద్దరు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఫిట్‌నెస్‌పై ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా వరుసగా డబుల్‌ సెంచరీ, సెంచరీతో చెలరేగిన రోహిత్‌ శర్మ గనుక గాయం కారణంగా జట్టుకు దూరమైతే టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇప్పటికే మొదటి టెస్టు తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇండియాకు తిరిగి రానున్న విషయం తెలిసిందే. దీంతో హిట్‌మ్యాన్‌ కూడా అందుబాటులో లేకుంటే బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. (చదవండి: జట్టు కోసం ఎక్కడైనా ఆడతా: రోహిత్‌)

ఈ నేపథ్యంలో రోహిత్‌ స్థానంలో యువ ఆటగాడు, ఐపీఎల్‌ జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే టీమిండియా తరఫున వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడిన అ‍య్యర్‌ టెస్టుల్లో కూడా అరంగేట్రం చేసేందుకు మార్గం సుగమమవుతుంది. ఇక డిసెంబరు 17న మొదలయ్యే టెస్టు సిరీస్‌లో పాల్గొనాలంటే రోహిత్‌ శర్మ, ఇషాంత్‌ మరో నాలుగైదు రోజుల్లోనే ఆస్ట్రేలియా చేరుకోవాలని హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆలస్యం అయ్యే కొద్దీ పరిస్థితులు మారిపోతాయని, క్వారంటైన్‌ నిబంధనల నేపథ్యంలో వీలైనంత త్వరగా వారిద్దరు భారత్‌ నుంచి బయల్దేరాలని అభిప్రాయపడ్డాడు. టెస్టు సిరీస్‌లో ఆడాలంటే కనీసం ఒక ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనైనా ఆడాల్సి ఉంటుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా రోహిత్‌, ఇషాంత్‌ పూర్తిస్థాయిలో గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆసీస్‌కు వెళ్తారా లేదా అన్న అంశంపై సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో అయ్యర్‌ను రిజర్వ్‌ ఆటగాడిగా తీసుకునే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది.(చదవండి: ఐపీఎల్‌ 2020: బీసీసీఐ ఆదాయం ఎంతంటే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement