ICC CWC 2023 Final Ind Vs Aus: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా.. ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తుదిపోరు.. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ హైవోల్టేజీ మ్యాచ్ గురించే చర్చ..
భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని మరీ వీక్షణలు.. ఏ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? అనే విశ్లేషణలు.. ఈసారి భారత జట్టు ఎలాగైనా ట్రోఫీ గెలవాలని పూజలు, ప్రార్థనలు.. టాప్ స్కోరర్, టాప్ వికెట్ టేకర్.. మ్యాచ్ విజేత ఎవరన్న విషయాలపై అంచనాలు.. రోహిత్ హిట్టింగ్ ఆడతాడు.. కోహ్లి పరుగుల వరద పారిస్తాడనే ఆకాంక్షలు..
ఇలా ఆదివారం ప్రతీ క్రికెట్ అభిమాని తమకు తోచిన రీతిలో సోషల్ మీడియా వేదికగా వారి వారి అభిప్రాయాలు పంచుకుంటూనే ఉన్నారు. అయితే, ఇందులో ప్రముఖ జ్యోతిష్కుడు సుమిత్ బజాజ్ కచ్చితమైన అంచనాతో ముందుకు వచ్చి క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్చపరిచారు.
టీమిండియా- ఆస్ట్రేలియా ఫైనల్లో ముఖ్యమైన ఓవర్లు ఇవేనంటూ సుమిత్ వేసిన అంచనా నిజమైంది. ‘‘తొలి ఇన్నింగ్స్‌లో 3, 5, 7,9, 9.4- 10.2, 10.3- 11.2, 14.4- 15.2, 17, 19, 20, 22, 24,25,27,31,34.4-35.2,47’’ అని సుమిత్ బజాజ్ ఎక్స్ ఖాతాలో తన అంచనాను తెలియజేశాడు.
కాగా అహ్మదాబాద్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. పవర్ ప్లేలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఐదో ఓవర్ రెండో బంతికి స్టార్క్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్(4) ఆడం జంపాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ దూకుడుగా ఆడుతున్న తరుణంలో 9.4 ఓవర్ వద్ద గ్లెన్ మాక్స్‌వెల్ బౌలింగ్‌లో రోహిత్(42) హెడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ వచ్చీ రావడంతోనే ఫోర్ బాదాడు. కానీ... 10.2 వద్ద కమిన్స్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సుమిత్ చెప్పినట్లు 9.4-10.2 మధ్య టీమిండియా రోహిత్, అయ్యర్ రూపంలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment