విరాట్ కోహ్లి- రోహిత్ శర్మ (PC: BCCI/ICC)
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల పరిస్థితి చూడలేకపోయామని టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత వాళ్లిద్దరూ ఏడుస్తూనే ఉన్నారని నవంబరు 19 నాటి చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.
కాగా సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత వరల్డ్ కప్ టైటిల్ ముంగిట నిలిచిన భారత జట్టుకు ఆసీస్ షాకిచ్చిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షకు పైగా టీమిండియా అభిమానుల నడుమ ఆరోసారి చాంపియన్‌గా అవతరించింది. దీంతో కప్ గెలవాలనుకున్న రోహిత్ సేన ఆశలకు గండిపడింది.
ఇక 36 ఏళ్ల రోహిత్ శర్మ, 35 ఏళ్ల విరాట్ కోహ్లికి ఇదే ఆఖరి వన్డే ప్రపంచకప్ కానుందన్న తరుణంలో వారిద్దరు కంటతడి పెట్టిన తీరు అభిమానుల మనసులను మెలిపెట్టింది. చేతుల్లో ముఖం దాచుకుంటూ కన్నీళ్లను ఆపుకొంటూ ఇద్దరూ మైదానం వీడటం ఉద్వేగానికి గురిచేసింది.
నాటి సంఘటన గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అశ్విన్.. "ఆరోజు మేమంతా చాలా బాధపడ్డాం. ముఖ్యంగా రోహిత్, కోహ్లి ఏడుస్తూనే ఉన్నారు. వాళ్లిద్దరిని అలా చూసి మాకు మరింత బాధ కలిగింది. అసలు అలా జరగకుండా ఉండాల్సింది. ఎంతో అనుభవం, నైపుణ్యం ఉన్న జట్టు. కచ్చితంగా గెలుస్తుందనే అనుకున్నాం.
జట్టులోని ప్రతి ఒక్కరు తమ పాత్రలను చక్కగా పోషించారు. కానీ చేదు అనుభవం ఎదురైంది. సహజంగానే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఇద్దరు లీడర్లు ఆటగాళ్లకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చి వాళ్లు మరింత మెరుగుపడేలా చేశారు" అని రోహిత్, కోహ్లిల వ్యక్తిత్వాలను ప్రశంసించాడు.
ఇక రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అన్న అశూ.. జట్టులోని ప్రతి ఆటగాడి ఇష్టాలు, అయిష్టాలు అతడికి తెలుసని పేర్కొన్నాడు. అందరి నైపుణ్యాల గురించి అతడికి అవగాహన ఉందని.. ఎవరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో రోహిత్‌కు బాగా తెలుసని కొనియాడాడు. అయితే, కొన్నిసార్లు ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కోక తప్పదంటూ ప్రపంచకప్ ఓటమిని ఉదాహరించాడు.
కాగా అక్షర్ పటేల్ గాయం కారణంగా దూరం కావడంతో అశ్విన్ ఆఖరి నిమిషంలో వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో అక్టోబరు 8 నాటి చెన్నై మ్యాచ్‌లో మాత్రమే ఆడే అవకాశం ఈ స్పిన్నర్‌కు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment