వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో అనూహ్య ఓటమితో టీమిండియాకు నిరాశే మిగిలింది. సొంతగడ్డపై కప్ గెలవాలన్న పట్టుదలతో ఆది నుంచి అద్భుతంగా ఆడినా.. అసలు పోరులో పరాజయమే ఎదురైంది. దీంతో పుష్కరకాలం తర్వాత మరోసారి వన్డే ప్రపంచకప్‌ను అందుకోవాలన్న కల కలగానే మిగిలిపోయింది.
అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత అభిమానులతో పాటు ఆటగాళ్ల గుండెలు ముక్కలయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా ఇతర ఆటగాళ్లంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
తుదిమెట్టుపై బోల్తా పడిన తీరును జీర్ణించుకోలేక ముంచుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని డ్రెస్సింగ్‌రూంకు వెళ్లిపోయారు. నిరాశతో అలా కూర్చుండిపోయారు. అయితే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ ఆ గంభీర వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశాడు.
ప్రపంచకప్-2023 సందర్భంగా ప్రవేశపెట్టిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆఖరి మ్యాచ్‌లోనూ బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను అందజేశాడు. అహ్మదాబాద్‌లో ఆసీస్‌తో ఆదివారం నాటి ఫైనల్లో ఈ అవార్డు అత్యధిక పరుగుల వీరుడు విరాట్ కోహ్లికి లభించింది.
అయితే, ప్రతిసారి వినూత్న పద్ధతిలో విజేతను ప్రకటించే దిలీప్ ఈసారి మాత్రం సాదాసీదాగా కోహ్లి పేరును ప్రకటించాడు. ఓటమి బాధలో ఉన్న ఆటగాళ్లంతా అలా నిరాశగా కూర్చుండిపోగా దిలీప్ స్ఫూర్తిదాయక ప్రసంగంతో వారిలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించాడు.
‘‘ఇది కష్టసమయం. మనందరికీ బాధాకరమైన రోజు. అయితే, మనలో ఎలాంటి ప్రయత్నలోపం లేదు. ప్రతి ఒక్కరం గెలుపు కోసం శ్రమించాం. కానీ ఫలితం మనకు అనుకూలంగా రాలేదు.
అయితే, రాహుల్ భయ్యా చెప్పినట్లు మిమ్మల్ని చూసి మాతో పాటు అభిమానులంతా గర్వపడుతున్నారు. ఈ జట్టులో ఉన్న ప్రతి ఒక్క ఆటగాడు ప్రాక్టీస్ సెషన్‌లో ఎంత కఠినశ్రమకోర్చాడో మాకు తెలుసు.
ఆట పట్ల మీ అంకిత భావం, నిబద్ధతను ప్రశంసించితీరాల్సిందే. గెలిచేందుకు మీరు శాయశక్తులా ప్రయత్నించారు. ఇంతకంటే ఇంకేం కావాలి. చాలా బాగా ఆడారు’’ అని దిలీప్ టీమిండియాను ప్రశంసించాడు.
అనంతరం రవీంద్ర జడేజా మెడల్‌ను కోహ్లి మెడలో వేశాడు. కాగా ప్రపంచకప్ ఈవెంట్లో ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు దిలీప్ ఇలా మెడల్స్ అందజేశాడు. కోహ్లి రెండుసార్లు, శ్రేయస్ అయ్యర్ రెండుసార్లు గెలవగా.. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ తదితరులు కూడా పతకం అందుకున్నారు. కాగా ఆసీస్‌తో ఫైనల్లో షమీ బౌలింగ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment