రద్వాన్‌స్కా శ్రమించి... | US Open 2016: Agnieszka Radwanska battles past Naomi Broady | Sakshi
Sakshi News home page

రద్వాన్‌స్కా శ్రమించి...

Published Sat, Sep 3 2016 1:32 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

రద్వాన్‌స్కా శ్రమించి... - Sakshi

రద్వాన్‌స్కా శ్రమించి...

* మూడో రౌండ్‌లోకి నాలుగో సీడ్
* సెరెనా, వీనస్ అలవోకగా...
* యూఎస్ ఓపెన్ టోర్నమెంట్

న్యూయార్క్: గతంలో పదిసార్లు యూఎస్ ఓపెన్‌లో పాల్గొన్నా ఒక్కసారీ నాలుగో రౌండ్ దాటలేకపోరుున నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్) ఈసారి ఆ అడ్డంకిని దాటి  మరో అడుగు ముందుకేసింది. నవోమి బ్రాడీ (బ్రిటన్)తో జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో రద్వాన్‌స్కా 7-6 (11/9), 6-3తో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. గంటా 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రాడీ నుంచి రద్వాన్‌స్కాకు గట్టిపోటీనే ఎదురైంది.

బ్రాడీ శక్తివంతమైన సర్వీస్‌లు, అంచనా వేయలేని షాట్‌లతో రద్వాన్‌స్కా తొలి సెట్‌లో ఒకదశలో 2-5తో వెనుకబడింది. అయితే బ్రాడీ ఆటతీరుపై అవగాహన కలిగాక ఈ ప్రపంచ మాజీ రెండో ర్యాంకర్ తేరుకుంది. స్కోరును సమం చేయడంతోపాటు సెట్‌ను టైబ్రేక్ వరకు తీసుకెళ్లింది. టైబ్రేక్‌లో రద్వాన్‌స్కా 5-2తో ముందంజ వేసినా వెంటనే తడబడింది. రెండుసార్లు సెట్ పాయింట్లను కాపాడుకొని తుదకు టైబ్రేక్‌లో 11-9తో గెలిచి తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్ తొలి గేమ్‌లోనే రద్వాన్‌స్కా తన సర్వీస్‌ను కోల్పోయి 0-2తో వెనుకబడింది.

కానీ వెంటనే కోలుకొని బ్రాడీ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రద్వాన్‌స్కా స్కోరును 2-2తో సమం చేసింది. ఆ తర్వాత మరోసారి బ్రాడీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌ను, మ్యాచ్‌ను కై వసం చేసుకుంది. ‘బ్రాడీ కంటే ఒకట్రెండు పాయింట్లు మెరుగ్గా ఆడాను. నేను 100 శాతం శ్రమించేలా ఆమె ఆడించింది. ఆరంభంలో కాస్త నెమ్మదిగా కదిలాను. దానికి మూల్యంగా రెండుసార్లు సెట్ పాయింట్ కోల్పోయే పరిస్థితి ఎదుర్కొన్నాను. ముఖ్యంగా బ్రాడీ సర్వీస్ చాలా బాగా చేసింది. దాంతో ప్రతి పాయింట్ కీలకంగా మారింది’ అని రద్వాన్‌స్కా వ్యాఖ్యానించింది.
 
అక్కాచెల్లెళ్లు ముందుకు...
మరోవైపు విలియమ్స్ సిస్టర్స్ సెరెనా, వీనస్ సునాయాస విజయాలతో మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సెరెనా 6-3, 6-3తో వానియా కింగ్ (అమెరికా)పై, ఆరో సీడ్ వీనస్ 6-2, 6-3తో జూలియా జార్జెస్ (జర్మనీ)పై విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో పదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 7-5తో మాంట్‌సెరెట్ గొంజాలెజ్ (పరాగ్వే)పై, 17వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా) 6-2, 4-6, 7-6 (7/5)తో మ్లాడెనోవిచ్ (ఫ్రాన్‌‌స)పై, 11వ సీడ్ కార్లా నవారో (స్పెయిన్) 6-1, 6-4తో జెలెనా జంకోవిచ్ (సెర్బియా)పై గెలిచారు. 16వ సీడ్, మాజీ చాంపియన్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 3-6, 3-6తో షుఝె జాంగ్ (చైనా) చేతిలో, 15వ సీడ్ తిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 4-6, 6-4, 4-6తో వర్వారా లెప్‌చెంకో (అమెరికా) చేతిలో ఓడిపోయారు.
 
ముర్రే, వావ్రింకా జోరు
పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ కీ నిషికోరి (జపాన్) మూడో రౌండ్‌లోకి చేరుకున్నారు. రెండో రౌండ్‌లో ముర్రే 6-4, 6-1, 6-4తో గ్రానోలెర్స్ (స్పెరుున్)పై, వావ్రింకా 6-1, 7-6 (7/4), 7-5తో గియానెసి (ఇటలీ)పై, నిషికోరి 6-4, 4-6, 6-4, 6-3తో ఖచనోవ్ (రష్యా)పై గెలిచారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్టియ్రా) 6-4, 6-3, 6-2తో బెరాన్‌కిస్ (లిథువేనియా)పై, 11వ సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెరుున్) 6-0, 4-6, 5-7, 6-1, 6-4తో ఫాగ్‌నిని (ఇటలీ)పై, 14వ సీడ్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 7-5, 6-4, 6-4తో జెబలోస్ (అర్జెంటీనా)పై నెగ్గి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. 16వ సీడ్ ఫెలిసియానో లోపెజ్ (స్పెరుున్) 2-6, 4-6, 6-1, 7-5తో జోవో సుసా (పోర్చుగల్) చేతిలో, 30వ సీడ్ సిమోన్ (ఫ్రాన్‌‌స) 6-3, 2-6, 2-6, 7-6 (7/1), 6-7 (3/7)తో లొరెంజీ (ఇటలీ) చేతిలో, 27వ సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 4-6, 4-6, 7-5, 2-6తో డానియల్ ఇవాన్స్ (బ్రిటన్) చేతిలో ఓటమి చవిచూశారు.
 
ప్రిక్వార్టర్స్‌లో వొజ్నియాకి, విన్సీ
గతేడాది రన్నరప్ రొబెర్టా విన్సీ (ఇటలీ), మాజీ నంబర్‌వన్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్‌లో విన్సీ 6-0, 5-7, 6-3తో వితెఫ్ట్ (జర్మనీ)పై, వొజ్నియాకి 6-3, 6-1తో మోనికా నికులెస్కూ (రొమేనియా)పై గెలిచారు. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో సెవస్తోవా (లాత్వియా) 6-4, 6-1తో కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్)ను ఓడించింది.
 
ప్రాంజల శుభారంభం
బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో 16వ సీడ్ ప్రాంజల 6-3, 6-2తో విక్టోరియా ఎమ్మా (అమెరికా)ను ఓడించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో లియాండర్ పేస్ (భారత్)-బెగెమన్ (జర్మనీ) ద్వయం 2-6, 7-5, 4-6తో స్టీఫెన్ రాబర్ట్ (ఫ్రాన్‌‌స)-డూడీ సెలా (ఇజ్రాయెల్) జంట చేతిలో ఓడిపోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement