వైష్ణవి రెడ్డికి టైటిల్
ఆలిండియా సబ్-జూనియర్ బ్యాడ్మింటన్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సబ్-జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి మెరిసింది. తమిళనాడులోని శివకాశిలో ముగిసిన ఈ టోర్నమెంట్‌లో ఆమె అండర్-13 బాలికల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ వైష్ణవి 21-4, 21-15తో నాలుగో సీడ్ ఉత్సవ పాలిట్ (పశ్చిమ బెంగాల్)పై గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్ జోడీలు అండర్-15 బాల, బాలికల డబుల్స్‌లో విజేతలుగా నిలిచాయి. బాలుర ఫైనల్లో టాప్ సీడ్ గౌస్ షేక్-బషీర్ సయ్యద్ (ఏపీ) ద్వయం 21-19, 21-14తో మూడో సీడ్ నవనీత్-విష్ణువర్ధన్ గౌడ్ జంటపై విజయం సాధించగా, బాలికల ఫైనల్లో ఆరో సీడ్ షబానా బేగం-ప్రీతి (ఏపీ) జంట 20-22, 21-17, 21-13తో నివిత-వినోనా (తమిళనాడు) జోడిపై గెలిచింది.
అండర్-13 బాలుర ఫైనల్లో రెండో సీడ్ ప్రియాన్షు రాజవత్ (మధ్యప్రదేశ్) 18-21, 21-12, 21-15తో ఐదో సీడ్ సూరజ్ చక్రవర్తి (బెంగాల్)పై గెలిచాడు. అండర్-13 బాలుర డబుల్స్‌లో చంద్రజిత్ సింగ్ (మధ్యప్రదేశ్)-అర్షద్ షేక్ (ఏపీ) జోడి 21-9, 19-21, 21-7తో అచ్యుతాదిత్య రావు-సాయిచరణ్ (ఏపీ) జంటపై నెగ్గింది. బాలికల ఫైనల్లో నాలుగో సీడ్ తాన్య హేమంత్-కీర్తన (కర్ణాటక) 21-17, 21-18తో ఉత్సవ పాలిట్ (బెంగాల్)-మేఘా పొతంశెట్టి (ఏపీ)పై గెలుపొందారు. అండర్-15 బాలబాలికల టైటిళ్లను దిశాంత దేబ్‌నాథ్ (బెంగాల్), ఆకర్షి కశ్యప్ (చండీగఢ్) గెలుచుకున్నారు. ఫైనల్లో టాప్ సీడ్ దిశాంత 25-23, 21-23, 21-11తో ఎయిమ్సన్ సింగ్ (మధ్యప్రదేశ్)పై విజయం సాధించగా, రెండో సీడ్ ఆకర్షి 17-21, 21-18, 21-16తో పూజ దెవ్లేకర్ (మహారాష్ట్ర)పై నెగ్గింది.