
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్–2020 లక్ష్యంగా ఏర్పాటు చేసిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం నుంచి ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ (85 కేజీలు) పేరును తొలగించారు. రాహుల్‌తోపాటు ఇతర వెయిట్‌లిఫ్టర్లు పూనమ్ యాదవ్ (69 కేజీలు), సతీశ్ శివలింగం (77 కేజీలు) పేర్లను కూడా ఈ జాబితా నుంచి తొలగించడం గమనార్హం. ఈ ముగ్గురూ గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకాలు గెలిచారు.
స్టార్ షూటర్, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత గగన్ నారంగ్ పేరును కూడా ఈ జాబితా నుంచి తప్పించారు. ఏడోసారి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న గగన్ ఈసారి రిక్తహస్తాలతో తిరిగి వచ్చాడు. ఇటీవలి ప్రదర్శన, ఫిట్‌నెస్ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని ఆరుగురు షూటర్లను, ముగ్గురు వెయిట్‌లిఫ్టర్లను, ఇద్దరు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లను ‘టాప్’ పథకం నుంచి తొలగించామని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) ఒక ప్రకటనలో తెలిపింది.