కోహ్లీ, స్మిత్ విధ్వంసం సృష్టిస్తారు..!
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పాడ్డాయి. అయితే వీరిద్దరికి ఓ విషయంలో పోలిక ఉందని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అంటున్నాడు. తాజా ఐపీఎల్ సీజన్లోనే అత్యంత ఖరీదైన ఆటగాడు స్టోక్స్. అతడిని పుణే జట్టు ఏకంగా రూ. 14.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జో రూట్, కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ ప్రపంచలోనే ప్రమాదకర బ్యాట్స్‌మన్లని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. వీరిని ఔట్ చేయడానికి ప్రత్యర్థి బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందన్నాడు.
భారత, ఆసీస్ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ లు 80 పరుగులు చేసిన తర్వాత విధ్వంసం సృష్టిస్తారని.. సెంచరీ చేయడమే లక్ష్యంగా బ్యాట్ ఝులిపిస్తారని తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. కుదిరితే ఆ స్కోర్లను 150 లేదా 200గా మలచాలని ప్రయత్నిస్తారని ఇంగ్లండ్ ఆల్ రౌండర్, పుణే ఆటగాడు స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. విలియమ్సన్ అయితే అనవసరంగా బంతిని ఆడటని, అదే సమయంలో కోహ్లీ, స్మిత్ మాత్రం తమదైన శైలిలో బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తారని కొనియాడాడు. ఐపీఎల్-10లో స్టీవ్‌స్మిత్ సారథ్యంలో స్టోక్స్ ఆడనున్నాడు. పుణే జట్టులో అతడి స్థానం కన్ఫామ్ అయిపోయింది. దీంతో ప్రత్యర్థి జట్టు బెంగళూరుతో మ్యాచ్‌తో కోహ్లీని ఔట్ చేయడమే తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించాడు.