లండన్ : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఓటమి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఎన్నో విషయాలు నేర్పిందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ బ్రియర్లీ అన్నాడు. తొలి టెస్ట్ భారత్ ఓడి పోయింది.. కానీ ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కంటే టీమిండియా సారథి కోహ్లినే అత్యుత్తమ క్రికెటర్ అని బ్రియర్లీ పేర్కొన్నాడు. రూట్ బెస్ట్ క్రికెటర్ అయ్యుండొచ్చు.. కానీ కెప్టెన్‌గాను అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గానూ కోహ్లినే ది బెస్ట్ అని అభిప్రాయపడ్డాడు.
‘అన్ని ఫార్మాట్లో 50కి పైగా సగటుతో రాణించడం కష్టతరం. కానీ కోహ్లి దాన్ని సుసాధ్యం చేశాడు. హాఫ్ సెంచరీలను కోహ్లి తేలికగా శతకాలుగా, భారీ ఇన్నింగ్స్‌లుగా మార్చగలడు. ఫలితాలు సాధించడంలో రూట్ కంటే కోహ్లి ముందు వరుసలో ఉంటాడు. తొలి టెస్ట్ ఓటమి కోహ్లికి పలు విషయాలు నేర్పించింది. జట్టు సమష్టిగా రాణించి ఉంటే విజయం భారత్‌నే వరించేది. అయితే కోహ్లి లాంటి ప్రత్యేక ఆటగాడి ప్రదర్శనతోనే నెగ్గాలనుకోవడం ఆ జట్టును దెబ్బ తీసింది. టెస్టు ఓడిపోయాక డ్రెస్సింగ్ రూములో కోహ్లికి ఎదురుపడేందుకు కొందరు జట్టు సభ్యులు భయపడి ఉంటారు.
అయితే మూడో స్థానంలో కేఎల్ రాహుల్ బదులుగా డిఫెన్సివ్ ప్లేయర్ చతేశ్వర పుజారాను తీసుకోవాలి. టెస్టుల్లో 50కి పైగా సగటు ఉన్న పుజారాను టెస్టు జట్టులోకి తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కౌంటీల్లో అతడు విఫలమైన మాట వాస్తవమే. కానీ జేమ్స్ అండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ లాంటి మేటి ఇంగ్లండ్ పేసర్లను ఎదుర్కోవాలంటే పుజారా లాంటి బ్యాట్స్‌మెన్ జట్టుకు అవసరమని’ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ బ్రియర్లీ తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment