కోహ్లీ, డివిలియర్స్ .. ఎవరు బెస్ట్..?
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ కంటే ఆ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ఈ సీజన్ ప్రారంభానికి ముందే విరాట్.. వన్డేలు, టీ20ల్లో భారీగా పరుగులు చేశాడన్నాడు. 15 ఇన్నింగ్స్ లలో 4 శతకాలు బాదిన కోహ్లీ ప్రస్తుతం 919 పరుగులతో ఐపీఎల్ లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడని ప్రశంసించాడు. చేజింగ్ లో వందకు పైగా సగటు ఉన్న ఆటగాడు కోహ్లీ అని, అతడి గణాంకాలు కూడా ఇందుకు నిదర్శనమని స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ పేర్కొన్నాడు.
డివిలియర్స్ 360 డిగ్రీల ఆటగాడు అయినప్పటికీ విరాటే తన దృష్టిలో బెస్ట్ ప్లేయర్ అంటున్నాడు. ఏబీ 15 ఇన్నింగ్స్ లలో 170 స్టైక్ రేట్ తో 682 పరుగులు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ పై మ్యాచ్ లో ఏబీ ఒంటిచేత్తో జట్టును గెలిపించి ఫైనల్ కు చేర్చాడు. తనకంటే ఏబీనే అత్యుత్తమ ఆటగాడని కోహ్లీ ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించాడు. మైదానంలో అన్ని వైపులా షాట్లు ఆడగలిగే సత్తా ఉన్న ఆటగాడు అయినా, కోహ్లీ తరహా భారీ ఇన్నింగ్స్ లు డివిలియర్స్ ఆడలేదని స్పిన్ మాంత్రికుడు వార్న్ చెప్పుకొచ్చాడు.