ధోని రికార్డును బ్రేక్ చేసిన విరాట్
ముంబై:భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్ తో నాల్గో టెస్టులో విరాట్(235) డబుల్ సెంచరీతో మెరిశాడు. దాంతో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన భారత్ టెస్టు కెప్టెన్గా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉండేది. 2013లో ఆస్ట్రేలియాపై ఎంఎస్ ధోని సాధించిన 224 పరుగులే ఇప్పటివరకూ టెస్టుల్లో భారత కెప్టెన్గా అత్యధిక స్కోరు. దీన్ని కోహ్లి అధిగమించాడు.
మరొకవైపు ఒక క్యాలెండర్ ఇయర్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన భారత తొలి కెప్టెన్గా నిలిచాడు. ఈ ఏడాది వెస్టిండీస్ తో ఆ దేశంలో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన విరాట్.. ఆ తరువాత ఇటీవల న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన టెస్టులో కూడా డబుల్ సాధించాడు..ఇదిలా ఉండగా, ఒక ఏడాది మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత ఆటగాడు కూడా కోహ్లినే. గతంలో ఒక క్యాలెండర్ ఇయర్ లో భారత తరపున వినోద్ మన్కడ్, వినోద్ కాంబ్లి, రాహుల్ ద్రవిడ్ రెండు డబుల్ సెంచరీలు సాధించారు. 1955లో వినోద్ మన్కడ్, 1992లో కాంబ్లి, 2003లో ద్రవిడ్ ఆ ఘనతను సాధించిన భారత ఆటగాళ్లు.
కాగా, ఒక సిరీస్లో ఐదు వందలకు పైగా పరుగులు, ఒక ఏడాదిలో టెస్టులో వెయ్యి పరుగులను పూర్తి చేసుకున్నాడు. నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 35 పరుగులను పూర్తి చేసుకున్న కోహ్లి... ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి టెస్టు పరుగులను పూర్తి చేసుకున్న మూడో భారత కెప్టెన్గా నిలిచాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్(1997), రాహుల్ ద్రవిడ్(2006)లు మాత్రమే ఈ ఘనతను సాధించిన భారత కెప్టెన్లు.ఈ సిరీస్లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన రెండో భారత కెప్టెన్గా విరాట్ నిలిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 96వ పరుగు చేసే క్రమంలో ఈ సిరీస్లో విరాట్ 500 పరుగుల మార్కును చేరాడు. తద్వారా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సరసన నిలిచాడు.
ఇప్పటివరకూ ఈ ఫీట్ను గవాస్కర్ మాత్రమే రెండుసార్లు సాధించాడు. 1978-79 సీజన్లో వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో గవాస్కర్ ఐదు వందలకు పైగా పరుగులు చేయగా,1981-82 సీజన్లో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో గవాస్కర్ ఐదు వందల పరుగుల మార్కును రెండోసారి సాధించాడు.