
సవాల్‌కు సిద్ధం
అడిలైడ్: ఆస్ట్రేలియా పర్యటనలో ఎదురయ్యే అన్ని సవాళ్లకు సిద్ధంగా ఉన్నామని భారత టెస్టు జట్టు తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. ‘డేంజర్ మ్యాన్’ మిచెల్ జాన్సన్‌ను సమర్థంగా ఎదుర్కొనే సత్తా తమకు ఉందన్నాడు. తాము బాగా సన్నద్ధమయ్యామని, జట్టు మొత్తం సరైన దృక్పథంతో ఉందని చెప్పాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవన్‌తో సోమవారం మొదలయ్యే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు కోహ్లి మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలు అతని మాటల్లోనే...
పేస్, బౌన్స్: ఇక్కడి వాతావరణ పరిస్థితులను సరైన విధంగా ఉపయోగించుకోవడం కంటే ఆటగాళ్లు సరైన మైండ్‌సెట్ కలిగి ఉండటం ముఖ్యం. ఎందుకంటే పేస్, బౌన్స్ ఎప్పుడూ ఉండేవే. కాబట్టి మనం మానసికంగా దృఢంగా ఉంటే ఎలాంటి ప్రాక్టీస్ అవసరం లేదు.
వాస్తవానికి జాన్సన్ బౌలింగ్ అద్భుతంగా ఉంటుంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే బౌన్సీ, పేస్ వికెట్లపై అతన్ని ఎదుర్కొనే సత్తా మాకు ఉంది. మేం కూడా గట్టిపోటీ ఇస్తాం. పోటీ ఇవ్వలేమనడానికి ఎలాంటి కారణాలు లేవు. మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాం. మా ప్రణాళికలను సమర్థంగా అమలు చేస్తాం.
జట్టుకు నాయకత్వంపై: కెప్టెన్‌గా ఉండటం, జట్టును నడిపించడమంటే నాకు చాలా ఇష్టం. ఈ మ్యాచ్‌లో శుభారంభం చేయాలనుకుంటున్నా. నా ఆలోచలను మ్యాచ్‌లో చూపిస్తా. సవాళ్లను స్వీకరించే సత్తా నాలో ఉంది. జట్టు మొత్తం నాకు మద్దతుగా ఉంది. కాబట్టి మేం కోరుకున్నట్లుగా రాణిస్తాం. ఓవరాల్‌గా మ్యాచ్ చివరి రోజు మంచి ఫలితాన్ని చూస్తాం.
క్లార్క్ గాయంపై: కెప్టెన్ కాలిపిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడని తెలిసింది. అయితే గాయం తీవ్రత తెలియకుండా మాట్లాడడం సరైంది కాదు. ఇలాంటి టెస్టు సిరీస్‌కు ముందు గాయపడటం దురదృష్టకరమే. సిడిల్ కూడా బాగా పోటీ ఇస్తాడని తెలుసు. ఈ సిరీస్‌లో మాటల యుద్ధం ఉంటుంది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ప్రాక్టీస్ మ్యాచ్‌లపై: 2011-12 సిరీస్‌లో ఐదు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరిగినా.... ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాక్టీస్ మ్యాచ్‌లను సరైన రీతిలో ఉపయోగించుకుంటాం. ఇవి సరిపోతాయి. వికెట్‌పై పేస్, బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తుది జట్టును ఎంపిక చేసుకోవడం చాలా ప్రధానమైంది. గతంతో పోలిస్తే ఈసారి మరింత ఓపికగా ఆడాల్సిన అవసరం ఉంది.
సరైన బంతిని, సరైన దిశలో పంపించాలి. బ్యాట్స్‌మెన్ బలం, బలహీనతలకు అనుగుణంగా ఫీల్డింగ్ ఉండాలి. ఓ బ్యాట్స్‌మన్‌గా ఇక్కడ ఆడటం ఆస్వాదిస్తా. గత టూర్‌లో మాదిరిగా ఈసారి కూడా అభ్యంతకర సంజ్ఞలు ఉంటాయనుకుంటున్నా. మొత్తానికి మేం దూకుడైన క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాం. వాళ్లు కోరుకున్న విధంగా గట్టిపోటీ ఇస్తాం. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో నెగ్గితే మా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.