విరాట్ పై మిచెల్ అక్కసు..
సిడ్నీ: ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ వివాదానికి ఆజ్యం పోసేందుకు ఆ దేశ మాజీ క్రికెటర్లు, అక్కడి మీడియా యత్నిస్తునే ఉన్నాయి. ఈ వివాదాన్ని మరింత సాగదీయకుండా ముగింపు పలకాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పెద్దలు భావించినా, దానిపై ఆసీస్ క్రికెటర్ల మాటల దాడి మాత్రం ఆగలేదు. తాజాగా ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ ఓ క్రికెట్ బ్లాగుకు రాసిన కాలమ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై విషం కక్కాడు.
తమతో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లి దూకుడుగా ప్రవర్తించి ఫిర్యాదు వరకూ వెళ్లడానికి ప్రధాన కారణం అతనిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడమేనని ఈ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ విమర్శించాడు. ఇప్పటివరకూ జరిగిన తొలి రెండు టెస్టుల్లో విరాట్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతను ఒత్తిడికి లోనవుతున్నాడన్నాడు. దాంతోనే తనలోని భావోద్వాగాల్ని కంట్రోల్ చేసుకోవడంలో విఫలమయ్యాడని జాన్సన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
'మాతో రెండు టెస్టుల్లో విరాట్ రాణించలేక భంగపడ్డాడు. పరుగుల వేటలో విఫలం కావడమే అతనిలో ఒత్తిడిలో కారణం. ఇది విరాట్ కు కొత్తమే కాదు. గతంలో ఈ తరహా ఎమోషన్స్ ను అతను బయటపెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ తరహా రియాక్షన్స్ విరాట్ నుంచి వస్తాయని కెమెరా మ్యాన్లకు తెలుసు కాబట్టే ఏమి జరిగినా కెమెరాలు అతనిపై వైపు వేగంగా కదులుతాయి. విరాటే రియాక్షన్స్ ను క్యాచ్ చేయడమే లక్ష్యంగా కెమెరాలు పని చేస్తాయి. ఆ క్రమంలోనే విరాట్ కోహ్లి స్పందనను వేగంగా రికార్డు చేశాయి 'అంటూ జాన్సన్ తన అక్కసు వెళ్లగక్కాడు. ఈ సందర్భంగా 2014లో భారత్ పర్యటనలో విరాట్ తో జరిగిన మాటల యుద్ధాన్ని జాన్సన్ ప్రస్తావించాడు. ఆ సమయంలో కూడా ఈనాటి పరిస్థితులే విరాట్ నుంచి చూశామంటూ తమ ఆటగాళ్ల ప్రవర్తనను సమర్ధించుకున్నాడు.