
కోహ్లి ‘హ్యాట్రిక్’ మిస్!
ప్రస్తుత జట్టు ఆటగాళ్లలో వైజాగ్ అందరికంటే విరాట్ కోహ్లికి బాగా కలిసొచ్చిన మైదానం. తను ఇక్కడ గతంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో (2010 అక్టోబరు 20న ఆస్ట్రేలియాపై; 2011 డిసెంబరు 2న వెస్టిండీస్‌పై) సెంచరీలు చేశాడు. ఈ సారి కూడా శతకానికి చేరువైన భారత క్రికెట్ సంచలనం దురదృష్టవశాత్తు 99 పరుగుల దగ్గర వెనుదిరిగాడు. తాను మైదానంలో అడుగుపెడితే సెంచరీ ఖాయం... అనే తరహాలో ఇటీవల ఆడుతున్న విరాట్... ఈ మ్యాచ్‌లోనూ నిలకడ చూపించాడు.
తాను ఎదుర్కొన్న 32వ బంతికి గానీ తొలి ఫోర్ కొట్టలేదు. చిన్నవే అయినా ధావన్, యువీ, రైనాలతో కలిసి తను నెలకొల్పిన భాగస్వామ్యాలే ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాయి. 64 పరుగుల వద్ద బ్రేవో తన బౌలింగ్‌లోనే క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి... తనశైలిలో చూడచక్కని షాట్లతో అలరించి 99 పరుగులు చేశాడు. అప్పటిదాకా సంయమనంతో ఆడినా... రామ్‌పాల్ బంతిని పుల్ చేయబోయి డీప్ ఫైన్‌లెగ్‌లో దొరికిపోయాడు. 6 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉన్న హోల్డర్ ముందుకు పడుతూ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో కోహ్లి వన్డేల్లో తొలిసారి 99 వద్ద అవుటయ్యాడు. లక్ష్మణ్ (2002) తర్వాత విండీస్‌పై ఇలా అవుటైన రెండో భారత ఆటగాడు కోహ్లి. సచిన్ (2007) తర్వాత మరో భారత ఆటగాడు 99 పరుగుల దగ్గర అవుట్ కావడం కూడా ఇదే.
దటీజ్ ధోని స్టయిల్
వైజాగ్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ధోని మరోసారి ప్రదర్శించాడు. ఎనిమిదేళ్ల క్రితం ఇదే వేదికపై అద్భుత సెంచరీతో వెలుగులొకొచ్చిన మహీ... ఈ మ్యాచ్‌లోనూ నగర అభిమానులను అలరించాడు. ఇటీవల కాలంలో ధోని ఆటను గమనిస్తే... ఆరంభంలో నెమ్మదిగా ఆడటం, చివర్లో శరవేగంతో పరుగులు చేయడం తన స్టయిల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లోనూ అదే తరహాలో ఆడాడు. తొలి 18 బంతుల్లో అతను చేసినవి 3 పరుగులే. కానీ ఊహించనంత వేగంగా 39 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు.