చెన్నై: టీమిండియా-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. రవీంద్ర జడేజా రనౌట్ ఇందుకు ఆజ‍్యం పోసింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా రనౌట్ కాగా, అది వివాదాస్పదమైంది. టీమిండియా ఇన్నింగ్స్ 48 ఓవర్ నాల్గో బంతికి జడేజా బంతిని మిడ్ వికెట్ వైపు ఆడి సింగిల్ కోసం యత్నించాడు. అయితే దాన్ని అందుకున్న రోస్టన్ ఛేజ్ నాన్ స్టైకింగ్ ఎండ్‌లో వికెట్లను డైరక్ట్ త్రో గిరటేశాడు. అయితే దానిపై అంపైర్ ఔట్ ఇవ్వలేదు. ఆ సమయంలో జడేజా క్రీజ్‌లోకి వచ్చాడని భావించిన ఫీల్డ్ అంపైర్ షాన్ జార్జ్ అది నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే అది ఔట్‌గా రిప్లేలో తేలడంతో పొలార్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. దాంతో చేసేది లేక థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించాడు ఫీల్డ్ అంపైర్. దాంతో థర్డ్ అంపైర్ పలు కోణాల్లో చెక్ చేసి అది ఔట్‌గా నిర్దారించడంతో జడేజా పెవిలియన్ చేరాడు.
దీనిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక ఔట్‌ను నిర్దారించే క్రమంలో థర్డ్ అంపైర్‌కు ఫీల్డ్ అంపైర్ సిగ్నల్ ఇవ్వడానికి సమయం ఉంటుందని, ఆ సమయం దాటిపోయిన తర్వాత అంపైర్ ఇలా చేయడంపై కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేస్తూ డగౌట్‌లోకి వచ్చేసి బౌండరీ లైన్ వద్ద నిల్చున్నాడు. అది ఈలోపే ఔట్ అని థర్డ్ అంపైర్ తేల్చడంతో జడేజా పెవిలియన్‌కు చేరుకోవడానికి సిద్ధం కావడంతో కోహ్లి కూడా వెనక్కి వెళ్లిపోయాడు. కాగా, ఇలా అంపైర్ ఉదాసీనంగా వ్యవహరించడాన్ని అంతా తప్పుబడుతున్నారు. మ్యాచ్‌లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండాలని అనేక మార్పులు తీసుకొస్తున్న సమయంలో అంపైర్ ఇలా వ్యవహరించడం సరికాదని క్రికెట్ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment