ముంబై : సిరీస్ విజేతను డిసైడ్ చేసే మూడో టీ20 కోసం టీమిండియా, వెస్టిండీస్ జట్టు సిద్దమయ్యాయి. ముంబై వాంఖెడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన కోహ్లి సేన రెండో టీ20లో చతికిలపడింది. అయితే ఎలాగైన చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఇక రెండో మ్యాచ్‌లో గెలుపుతో ఆత్మవిశ్వాసంతో ఉన్న పొలార్డ్ అండ్ గ్యాంగ్ ముంబై మ్యాచ్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వాంఖెడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో పాటు ఛేజింగ్‌కు సులువు అవుతుందనే ఉద్దేశంతో పొలార్డ్ టాస్ గెలిచిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్ కోసం టీమిండియా రెండు కీలక మార్పులు చేసింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మణికట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌లను అనూహ్యంగా పక్కకు పెట్టి మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌లను తుది జట్టులోకి తీసుకుంది. అయితే అందరూ ఊహించనట్టు వాషింగ్టన్ సుందర్‌ను పక్కకు పెట్టలేదు. అతడికి టీమ్ మేనేజ్‌మెంట్ మరోసారి అవకాశం కల్పించింది. మరోవైపు విండీస్ జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. గత మ్యాచ్ విన్నింగ్ టీమ్‌తోనే ముంబై మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతోంది. ఇక ఈ మైదానంలో రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువని గత రికార్డులు పేర్కొంటున్నాయి. చివరి ఆరు టీ20 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఐదు మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. దీంతో మ్యాచ్‌పై మరింత ఆసక్తి పెరిగింది.
తుది జట్లు:
భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, రిషభ్ పంత్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్
వెస్టిండీస్: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), లెండిల్ సిమన్స్, లూయిస్, కింగ్, హెట్‌మైర్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్, పియరీ, విలియమ్స్, కాట్రెల్, హేడెన్ వాల్ష్
Comments
Please login to add a commentAdd a comment