ఆ ముగ్గురూ లేకపోవడం టీమిండియాకు నష్టం: సనత్‌ జయసూర్య | Rohit Kohli Jadeja Big Loss For India Will Aim to Take Advantage: Sanath Jayasuriya | Sakshi
Sakshi News home page

వాళ్లు లేకపోవడం టీమిండియాకు నష్టం.. మా లక్ష్యం అదే: సనత్‌ జయసూర్య

Published Wed, Jul 24 2024 4:10 PM | Last Updated on Wed, Jul 24 2024 8:09 PM

Rohit Kohli Jadeja Big Loss For India Will Aim to Take Advantage: Sanath Jayasuriya

టీమిండియా స్టార్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలపై శ్రీలంక క్రికెట్‌ జట్టు కొత్త కోచ్‌ సనత్‌ జయసూర్య ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఈ ఇద్దరూ తప్పక ఉంటారని కొనియాడాడు. జట్టులో వీరులేని లోటు ఎవరూ పూడ్చలేరని అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

గుడ్‌బై చెప్పేశారు
ఫలితంగా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఖాతాలో ఐసీసీ టైటిల్‌ చేరగా.. వన్డే వరల్డ్‌కప్‌-2011 జట్టులో భాగమైన కోహ్లి మరోసారి ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడాడు. ఈ క్రమంలో 37 ఏళ్ల రోహిత్‌ శర్మ, 35 ఏళ్ల విరాట్‌ కోహ్లి ఈ మెగా టోర్నీ తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

ఇక స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా ‘విరాహిత్‌’ ద్వయం బాటలోనే నడిచాడు. టీ20 వరల్డ్‌కప్‌-2024 సందర్భంగా సౌతాఫ్రికాతో ఫైనల్‌లో భాగంగా టీమిండియా తరఫున తన చివరి టీ20 మ్యాచ్‌ ఆడేశానని పేర్కొన్నాడు.

ఆరోజే ఆరంభం
ఈ క్రమంలో రోహిత్‌, కోహ్లి, జడ్డూ లేకుండా టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఈ సిరీస్‌ ద్వారా హెడ్‌ కోచ్‌గా గౌతం గంభీర్‌, టీ20 పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రస్థానం మొదలుకానుంది. కాగా శ్రీలంక- భారత్‌ జట్ల మధ్య జూలై 27న ఈ సిరీస్‌ ఆరంభానికి షెడ్యూల్‌ ఖరారైంది.

ఆ ముగ్గురూ లేకపోవడం టీమిండియాకు నష్టం
ఈ నేపథ్యంలో శ్రీలంక జట్టు తాత్కాలిక కోచ్‌ సనత్‌ జయసూర్య మీడియాతో మాట్లాడాడు. రోహిత్‌, కోహ్లి, జడ్డూ టీమిండియా జట్టుతో లేకపోవడం తమకు అనుకూలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ముందు వరుసలో ఉంటారు.

వాళ్ల ప్రతిభాపాటవాలు, క్రికెట్‌ ఆడే తీరు అమోఘం. ఈ ఇద్దరితో పాటు జడేజా కూడా జట్టులో కీలక సభ్యుడే. అయితే, ప్రస్తుతం ఈ ముగ్గురు భారత టీ20 జట్టులో లేరు. వారి గైర్హాజరీ తప్పకుండా మాకు లాభిస్తుంది’’ అని సనత్‌ జయసూర్య పేర్కొన్నాడు.

అప్పటిదాకా కోచ్‌గా
కాగా శ్రీలంక క్రికెట్‌ జట్టు తాత్కాలిక కోచ్‌గా మాజీ కెప్టెన్‌ సనత్‌ జయసూర్యను నియమిస్తున్నట్లు లంక బోర్డు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబరులో ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత అతడి పదవీకాలం ముగుస్తుందని వెల్లడించింది. 

ఇక కోచ్‌గా సనత్‌ జయసూర్యకు ఇదే తొలి సిరీస్‌ కాగా.. టీమిండియా శిక్షకుడిగా గౌతం గంభీర్‌ రూపంలో అతడికి గట్టి సవాల్‌ ఎదురుకానుంది.

కాగా శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా తొలుత మూడు టీ20.. అనంతరం మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇప్పటికే టీ20 జట్టుతో పాటు వన్డే జట్టులోనూ ఉన్న ఆటగాళ్లు లంకకు చేరుకోగా.. రోహిత్‌, కోహ్లి కొన్నాళ్ల తర్వాత వారితో కలవనున్నారు.

చదవండి: టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే!.. నో చెప్పిన ఐసీసీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement