నాగ్‌పూర్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ సారథి ధోని తమ వార్షిక కాంట్రాక్టు ఫీజులు పెంచాలని బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్‌ని కోరనున్నారు. ప్రస్తుతం ‘ఎ’ గ్రేడ్ క్రికెటర్లకు ఏడాదికి రూ. 2 కోట్లు చెల్లిస్తున్నారు. గతంలో ఈ మొత్తం రూ. కోటి ఉండేది. అయితే పెంచిన మొత్తం కూడా చాలదని అప్పట్లోనే క్రికెటర్లు అసంతృప్తి వెలిబుచ్చారు. అప్పటి కోచ్ కుంబ్లే సీఓఏకు ఇచ్చిన నివేదికలో రూ. 5 కోట్లు చెల్లించాలని సూచించారు. ఐపీఎల్ కాంట్రాక్టులేని పుజారా లాంటి క్రికెటర్ల అంశాన్ని అందులో ప్రస్తావించారు. సీఓఏ కూడా ఆటగాళ్ల వార్షిక ఫీజులు పెంచేందుకు సుముఖంగానే ఉంది. కుంబ్లే నివేదిక అంశాలను పొందుపరుస్తూ వినోద్ రాయ్ సుప్రీం కోర్టుకు నివేదించారు కూడా. అయితే దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)దే తుది నిర్ణయం. డిసెంబర్ 11న జరిగే బోర్డు ప్రత్యేక సర్వ సభ్య సమావేశం(ఎస్‌జీఎం)లో ఆమోదం లభిస్తేనే ఆటగాళ్ల జీతాలు పెరుగుతాయి. దీనిపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ ఆదాయంలో ఆటగాళ్లు వాటా కోరారని మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఏ ఆటగాడు అలాంటి ప్రతిపాదన చేయలేదు. అయితే ఆటగాళ్లకు కాంట్రాక్టు మొత్తాలు పెంచాలని సీఓఏ కూడా భావిస్తోంది’ అని అన్నారు. ప్రస్తుతం క్రికెటర్లు బోర్డు ఆదాయంలో 8 శాతంలోపే అందుకుంటున్నారు. దీన్ని మార్చాలని వినోద్ రాయ్ అనుకుంటున్నప్పటికీ బోర్డే తుది నిర్ణయం తీసుకోవాలి.
అందుకే... టి20 జట్టును ప్రకటించలేదా!
వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లి టి20లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్లే జాతీయ సెలక్టర్లు భారత టి20 జట్టును ప్రకటించలేకపోయారు. కీలకమైన దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు విశ్రాంతి కావాలని చెప్పడంతో కోహ్లిని లంకతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేయలేదు. తదుపరి మూడు టి20లలో ఆడేది లేనిది స్పష్టంగా చెప్పకపోవడంతో టి20 జట్టు ఎంపికను ఎమ్మెస్కే ప్రసాద్ బృందం వాయిదా వేసింది. ‘డిసెంబర్ 12 వరకు కోహ్లికి వ్యక్తిగత పనులున్నాయి. ఆ తర్వాతే అతను ఆడటంపై స్పష్టత వస్తుంది’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. శ్రీలంకతో వచ్చే నెల 20, 22, 24 తేదీల్లో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment