ధోని... నా రక్షకుడు: కోహ్లి
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం విరాట్ కోహ్లి అత్యుత్తమ ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తన కెరీర్ ప్రారంభంలో అతను గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాడు. నిలకడలేమితో చాలాసార్లు జట్టులో చోటు దక్కేది అనుమానంగానే మారేది. ఇలాంటి సమయంలో తనను కాపాడింది మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనియేనని ఈ స్టార్ బ్యాట్స్‌మన్ స్పష్టం చేశాడు. 2008లో వన్డే అరంగేట్రం చేసిన కోహ్లి ఇప్పటిదాకా తన కెరీర్ మొత్తం ధోని కెప్టెన్సీలోనే ఆడాడు. అయితే ప్రారంభ దశలో పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయే పరిస్థితి ఏర్పడినా తన విషయంలో ధోని ఆపద్భాందవుడి పాత్ర పోషించాడని కోహ్లి గుర్తుచేసుకున్నాడు.
‘కెరీర్ మొదట్లో ధోని నాకు గైడ్‌లా వ్యవహరించాడు. క్రికెటర్‌గా ఎదిగేందుకు చాలా అవకాశాలు ఇచ్చాడు. అనేకసార్లు జట్టులో చోటు కోల్పోయే పరిస్థితి ఉన్నా కాపాడాడు. నిజానికి తన స్థానం భర్తీ చేయడమంటే చాలా రిస్క్‌తో కూడుకున్నదే’ అని కోహ్లి బీసీసీఐ.టీవీకిచ్చిన ఇంటర్వూ్యలో పేర్కొన్నాడు. భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ బాధ్యతలో పూర్తి స్థాయిలో ముందుకెళ్లేందుకు తగిన సమయం దొరికిందని కోహ్లి తెలిపాడు. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు సిరీస్ మధ్యలోనే టెస్టు కెప్టెన్సీ దక్కి ఉక్కిరిబిక్కిరి అయినా ఈసారి అలాంటి పరిస్థితి లేదని చెప్పాడు. ‘ఈసారి మాత్రం వన్డే, టి20ల్లో సిరీస్‌కు చాలా ముందుగానే కెప్టెన్ అయ్యాను. ఇది ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలో నాకు ఉపయోగపడుతుంది’ అని కోహ్లి చెప్పాడు.